వడగళ్ల వాన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం..!

తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాలలో శుక్రవారం కురిసిన వడగళ్ల వాన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు.
వడగళ్ళ వాన వలన నెలకొన్న పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలన్నారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సి.ఎస్ ఆదేశించారు.
జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సి.ఎస్ సూచించారు. అకాల వర్షాల వలన ఏర్పడే నష్టాల అంచనాలను ఏప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాలన్నారు.