నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ సర్కారు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో 6 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. స్వయం ఉపాధి కింద అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు. జూన్ 2 వ తేదీన 5 లక్షల మంది లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులు, ఆయా రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు.
అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, పథకం ప్రధాన ఉద్దేశాలను విడమరిచి చెప్పారు. “నైపుణ్యం ఉండీ ఉద్యోగం లభించని యువతకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పించాలి. పారదర్శకంగా ఉండాలి. అర్హులు, నిజమైన నిరుద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఉద్దేశించిన ఈ పథకం ముందు ముందు మరింత పటిష్టంగా అమలు చేస్తాం. అర్హులైన యువతీ యువకులను ఎంపిక చేయడానికి ప్రజా ప్రతినిధులు మండలాల వారిగా సమావేశాలు నిర్వహించుకోవాలి. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కల్పించవచ్చు.
ఈ పథకం ద్వారా అర్హత ఉన్న వారికి 50 వేల నుంచి 4 లక్షల వరకు సహాయం అందించవచ్చు. ఇవ్వగలిగిన చోట ఉద్యోగాలు ఇస్తున్నాం. అవకాశాలున్న చోట ఉపాధి కల్పిస్తున్నాం. నైపుణ్యాన్ని నేర్పించాల్సిన చోట వృత్తి నైపుణ్య శిక్షణనిస్తున్నాం. రాష్ట్రంలో 57 వేలకుపైగా ఉద్యోగాలు ఇవ్వడంలో ఎక్కడా చిన్న పొరపాటు జరక్కుండా పారదర్శకంగా భర్తీ చేశాం. 22 వేల మంది టీచర్ల ప్రమోషన్లు, 30 వేల టీచర్ల బదిలీల్లో ఎక్కడా చిన్న ఆరోపణ రాకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి జరగని బదిలీల ప్రక్రియను పూర్తి చేశాము.
రాష్ట్రంలో సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. గతంలో నచ్చితే నజరానా నచ్చకపోతే జురిమానా విధానం ఉండేది. కానీ ప్రజా ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన, విధానపరమైన నిర్ణయాలతో పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
