తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది..!

 తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది..!

Loading

అన్ని రంగాల్లో సమృద్ధిని సాధిస్తూ, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలబెట్టే నిర్మాణానికి అందరం సంఘటితంగా, విశ్వాసంతో, నిబద్ధతతో కలిసి ముందుకు సాగుదామని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు పిలుపునిచ్చారు. అవకాశాలకు నెలవుగా, అభివృద్ధి మార్గంలో సాధికారత కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తు మరింత ఉజ్వలమైంది. ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞానంలో ఆధునికత, సామాజిక న్యాయం వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతోందని గవర్నర్ ఉద్ఘాటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్  ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలతో పాటు ఉజ్వలమైన భవిష్యత్తుకు తెలంగాణ అభివృద్ధికి రూపుదిద్దుకున్న ప్రణాళికలను గవర్నర్  తన ప్రసంగంలో ఆవిష్కరించారు.

యున నాయకుడు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పాలసీ, ప్రతి కార్యక్రమం, ప్రతి సంస్కరణ అవకాశాలు కల్పించడానికి, ప్రజల సాధికారత కోసం, సమ్మిళిత వృద్ధి కోసమని స్పష్టమైన విజన్‌తో నిర్ధేశించబడిందని గవర్నర్ గారు వివరించారు. బడ్జెట్ కేవలం అంకెల కూర్పు కాదని, భవిష్యత్తు కోసం ప్రభుత్వ ప్రాధాన్యతలు, విజన్‌కు ప్రతిబింబమని పేర్కొన్నారు. గవర్నర్  తన ప్రసంగంలో.. “నా తెలంగాణ ఒక అసాధారణ పరివర్తనకు చేరువలో ఉంది. ప్రభుత్వం ప్రతి పౌరుని ఆకాంక్షలను నెరవేర్చి దేశానికి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు వెళుతున్నాం. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలకు అనుగుణంగా అపరిమితమైన అవకాశాలతో తెలంగాణ తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తూ అభివృద్ధికి ఒక దిక్సూచిలా, ఒక మోడల్ రాష్ట్రంగా ఉండాలని భావిస్తోంది.

జయ జయహే తెలంగాణ – జననీ జయ కేతనం.. తెలంగాణ గేయం రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన పోరాటాలు, త్యాగాలను గౌరవించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఆశను, స్ఫూర్తిని నింపుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సాహసోపేతమైన మార్పు దిశగా ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయాన్ని అందించే దిశగా ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించడానికి ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫారసుల ఆధారం ఎస్సీ ఉప వర్గీకరణపై బిల్లును ప్రవేశపెట్టనుంది.

గ్రామీణ పాలనను బలోపేతం చేయడం, భూ సంబంధిత సేవలను సరళతరం చేయడం, భూ సమస్యలను సకాలంలో పరిష్కరించడం వంటి భూ పరిపాలనను క్రమబద్ధీకరించి, పౌరులందరికీ భూ భద్రత కల్పించడానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇంధన రంగంలో భద్రత, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ స్థిరమైన ఇంధనంలో అగ్రగామిగా ఉండేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ -2025 ద్వారా రోడ్ మ్యాప్‌ను ప్రకటించాం.

రైతులు రాష్ట్రానికి ప్రాణం లాంటివారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరచడానికి, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండేలా ఒక ప్రత్యేక సంస్థగా ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డుతో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది. రాష్ట్రంలో రూ. 20,616.89 కోట్లతో 25.35 లక్షల మంది రైతులకు 2 లక్షల చొప్పున పంట రుణమాఫీని అమలు చేసింది. రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని ఏడాదికి ఎకరాకు 12 వేల రూపాయలకు పెంచాం.

రాష్ట్ర ప్రయోజనాలను కాపడటానికి కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటా కోసం ట్రిబ్యునల్ II ముందు బలంగా వాదనను వినిపించింది. మహిళల సాధికారత, రక్షణ సమాన అవకాశాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా 149.63 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం, తద్వారా మహిళలకు 500.95 కోట్లు ఆదా చేసింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా ఒక లక్ష కోట్ల ఆర్థిక సహాయంతో లక్ష మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలగా తయారు చేస్తోంది. గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. 43 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ రూ. 500 లకు ఎల్పీజీ సిలిండర్ అందిస్తోంది.

యువజన సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రపంచంతో పోటీ పడే నైపుణ్యాలు గల ప్రతిభావంతులను అందించడానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను (#ATC) అందించే కార్యక్రమం చేపట్టాం. గత సంవత్సర కాలంలో 55 వేల మందికి పైగా యువతీ యువకులను ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ చేశాం. క్రీడల్లో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు బిల్లును ఆమోదించాం. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం 40 శాతం డైట్, 200 శాతం కాస్మెటిక్ చార్జీలను పెంచాం.

మెట్రో రైలు నెట్ వర్క్ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు వంటి ప్రాజెక్టులతో దేశంలోనే నెట్ జీరో సిటీగా ఆవిర్భవించాలన్న ఆకాంక్షతో ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తోంది. 7 మండలాలు, 56 గ్రామాలతో 765 చ.కి.మీ విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీ దేశంలో పట్టణాభివృద్ధిలో ఒక నమూగా నిలువబోతోంది” అని గవర్నర్‌ గారు వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబానికి 10 లక్షలకు పెంపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గృహ నిర్మాణం, విద్య, ఉపాధికి తీసుకున్న చర్యలు, రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా పారిశ్రామిక వృద్ధి సాధన, పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఐటీ హబ్‌ల విస్తరణ, ఏఐ, డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ తన హోదాను సుస్థిరం చేసుకుంటున్న విధానాలు.. వంటి అనేక అంశాలల్లో తెలంగాణ లక్ష్యాలను గవర్నర్ గారు తన ప్రసంగంలో ప్రస్తావించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *