బాబు ష్యూరిటీ అంటే… చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ.!

 బాబు ష్యూరిటీ అంటే… చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ.!

Babu Surety means… a guarantee of frauds that have not been seen in history.!

Loading

‘‘బాబు ష్యూరిటీ అంటే… చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ అర్దం !’’ అని బడ్జెట్‌ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా ఎగ్గొడుతూ.. ఇస్తున్న ఒకటో రెండో పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ… లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ.. పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ.. సూపర్‌ సిక్స్‌కు ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కారు శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్‌ను సమర్పించిందని చిన్న శ్రీను పేర్కొన్నారు.

సూపర్‌ సిక్స్‌ సహా హామీలన్నీ విస్మరించి పిల్లలు, మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతన్నలు.. ఇలా అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం దగా చేసింది. ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అని హామీ ఇచ్చి ఆ ఊసే లేకుండా చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ఏడాదిగా యువత నెలకు రూ.3 వేల చొప్పున నష్టపోతోంది. 1.60 కోట్ల మందికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల ఆర్థిక సాయాన్ని మరోసారి ఎగ్గొట్టడంతో మహిళలు ఏడాదికి సుమారు రూ.28,800 కోట్లు కోల్పోతున్నారు! ఇక ‘తల్లికి వందనం’ అంటూనే బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లకుపైగా కోత పెట్టారు!

అన్నదాతా సుఖీభవ అమలుకు కావాల్సింది రూ.10,717 కోట్లైతే బడ్జెట్‌లో ఇచ్చింది కేవలం రూ.6,300 కోట్లే! ఈ లెక్కన 22 లక్షల మందికిపైగా రైతులు రూ.4,417 కోట్ల పెట్టుబడి సాయానికి దూరం కానున్నారు. గతేడాది మొండి చెయ్యి చూపడంతో రైతన్నలు ఇప్పటికే రూ.పది వేల కోట్లకుపైగా నష్టపోయారు. ఇక ఇప్పటికే దాదాపు రెండు లక్షల పెన్షన్లను తగ్గించగా తాజా బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.5 వేల కోట్లకుపైగా కోత విధించటాన్ని బట్టి మరిన్ని పింఛన్లను ఎగరగొట్టడం ఖాయంగా కనిపిస్తోందని మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) అన్నారు.

వెరసి.. ప్రణాళిక – ఆలోచనల సమ్మిళతంగా ఉండాల్సిన రాష్ట్ర బడ్జెట్‌.. అంతులేని మోసాలు.. గాడి తప్పిన అంకెల సమాహారంగా మిగిలిపోయింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో మంత్రులు అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి పి.నారాయణ ప్రవేశపెట్టారని అన్నారు.

అంకెల్లో ఆడంబరంగా..

అప్పులతో ముంచెత్తుతూ.. అంకెల్లో అత్యంత భారీతనంతో ఆడంబరంగా కనిపించిన ఈ బడ్జెట్‌ పరిమాణం రూ.3.22 లక్షల కోట్లు! కానీ ఇంత భారీ బడ్జెట్‌లోనూ హామీలకు కేటాయింపులు చేయకుండా సీఎం చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. గత ప్రభుత్వం డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఏకంగా రూ.4.57 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరిస్తే ఇప్పుడు చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పులతో ముంచెత్తి చరిత్ర సృష్టించారు అన్నారు.

ఆకారం పెంచినా.. నేల విడిచి సాము చేసినా.. ఈ బడ్జెట్‌ చంద్రబాబు సర్కారు మోసాలను మాత్రం దాచిపెట్టలేకపోయింది! ఎన్నికల హామీల సంగతి అటుంచితే.. సీఎం చంద్రబాబు రోజూ జబ్బలు చరుచుకునే ‘సంపద సృష్టి’ ఆనవాళ్లు బూతద్దంతో గాలించినా బడ్జెట్‌లో కానరాలేదు. వైఎస్సార్‌ సీపీ హయాంలో విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పోర్టులు, కొత్త మెడికల్‌ కాలేజీల గురించి ఈ బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించలేదు.

ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ఇంటి ముంగిటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంక్షేమ పథకాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేయడంతో ఇవాళ పల్లెలు కళ తప్పి కనిపిస్తున్నాయి. వలంటీర్ల వేతనాలు రూ.ఐదు వేలు కాదు.. ఏకంగా రూ.పది వేలకు పెంచుతామంటూ నమ్మబలికి ఏకంగా వ్యవస్థకే మంగళం పాడేశారు!

హామీలు గాలికి..

సూపర్‌ సిక్స్‌లో తొలి హామీగా పేర్కొన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి గురించి బడ్జెట్‌లో అసలు ప్రస్తావనే లేకుండా చేశారు. ఆడబిడ్డ నిధికి పైసా కూడా కేటాయించలేదు. మహిళల ఉచిత బస్సు ఊసే లేదు. అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు కోతలు విధించి అరకొర కేటాయింపులను చూపించినా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. కాగితాల్లో కేటాయింపులు చేయడం.. అమలు చేయకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే!

గత బడ్జెట్‌లోనూ అన్నదాతా సుఖీభవకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు చేసినట్లు చూపించి చివరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడం తెలిసిందే. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం కింద ఇచ్చేందుకు రూ.9,407 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.

పేదల ఇళ్లకు పాతర..

పేదల ఇళ్ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం పాతరేసింది. వైఎస్సార్‌సీపీ హయాంలో 2023–24లో ఏకంగా రూ.6,866 కోట్లు కేటాయించి వ్యయం చేయగా.. కూటమి సర్కారు 2024–25 పేదల రూ.4,012 కోట్లు కేటాయించి కేవలం రూ.1,611 కోట్లే వ్యయం చేసినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొంది. ఇక 2025–26లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లు ప్రతిపాదించిందని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మీడియా ముఖంగా తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *