కేసీఆర్ జన్మదిన సందర్భంగా వృక్షార్చన..!

తన మేధో పుత్రిక ‘హరితహారం’ ద్వారా తెలంగాణ భూతల్లికి ఆకుపచ్చని చీర చుట్టారు తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.ఆయన జన్మ దిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగు లాగా వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు మాజీ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఆఫీస్ సెక్రటరీ, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, బీగాల గణేష్, శంకర్ నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ సమక్షంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అని అన్నారు. వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను కేటీఆర్ అభినందించారు.
రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంతోష్ కుమార్ కోరారు. హరితసేనలోని సభ్యులందరూ మొక్కలు నాటి అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు.
