తాను గెలవక..ఆప్ ను ఓడించి-ఎడిటోరియల్..!

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఇరవై రెండు స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ కు పద్నాలుగు స్థానాలు వెనకబడి నాలుగో సారి అధికారంలోకి రావాలన్న కలలను దూరం చేసుకుంది. మరోవైపు బీజేపీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలిచి ఇరవై ఏడు ఏండ్ల తర్వాత సీఎం కుర్చిని దక్కించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో జీరో స్థానానికే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో అదేవిధంగా జీరోకి పరిమితమై కేవలం ఆరుశాతం ఓట్లు కాంగ్రెస్ సాధించింది .
ఎంత ఘోరంగా ఓడిందంటే చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. కొన్ని చోట్లయితే నాలుగో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయా వకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక రకంగా భాజపా నెగ్గడానికి కాంగ్రెస్ కూడా కారణ మైందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ తాను ఓడటమే కాదు.. ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీనీ కోలుకోలేని దెబ్బ తీసింది. ఓట్లను చీల్చి చాలా స్థానాల్లో ఫలితాలను తారుమారు చేసింది.
న్యూదిల్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రవాల్ 4,089 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీచేసి మూడో స్థానంలో నిలిచిన సందీప్ దీక్షిత్ (దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమా రుడు)కు 4,568 ఓట్లు వచ్చాయి. ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే కేజ్రివాల్ స్వల్ప మెజారిటీతో గట్టెక్కేవారే. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పోటీ చేసిన జంగపురాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ
భాజపా అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో సిసోదియా కేవలం 675 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఫర్హాద్ సూరికి 7,350 ఓట్లు వచ్చాయి. గ్రేటర్ కైలాస్లో మంత్రి సౌరభ్ భరద్వాజ్పై 3,188 ఓట్లతో భాజపా అభ్యర్థి షికారాయ్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 6,711 ఓట్లు పడ్డాయి. ఇదొక్క నియోజకవర్గమే కాదు. రాజేందర్ నగర్, ఛతర్పుర్, సంగమ్ విహార్, గ్రేటర్ కైలాస్. . ఇలా 14కు పైగా స్థానాల్లో ఆప్ అవకాశాలకు కాంగ్రెస్ గండి కొట్టింది.
రాజేందర్ నగర్ లో ఆప్ 45,440 ఓట్లు సాధిస్తే, కాంగ్రెస్కు 4,015 ఓట్లు వచ్చాయి. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆ నియోజవర్గం ఆప్ ఖాతాలో చేరేది. ఛతరురలోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆప్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. ఇది భాజపాకు కలిసొచ్చింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా స్థానాల్లో బల మైన అభ్యర్ధులనే నిలబెట్టింది. కానీ వారెవ్వరూ గట్టి పోటీ ఇవ్వలేకపో యారు. కచ్చితంగా నెగ్గుతామనుకున్న నియోజకవర్గాలన్నింటిలోనూ కాంగ్రెస్ పరిస్థితి దాదాపు ఇంతే. 2020తో పోలిస్తే ఈసారి ఓట్ల శాతం 21% మేర పెరగడం ఒక్కటే ఆ పార్టీకి కాస్త ఊరట.ఆప్ అవకాశాలను ఎక్కడ ఎలా దెబ్బతీసిందో కింద పేర్కోన్న వివరాల్లో తెలుస్తుంది.

