గాంధీభవన్ కెళ్లే తీరిక ఉంది..ప్రజావాణికి లేదా..?

 గాంధీభవన్ కెళ్లే తీరిక ఉంది..ప్రజావాణికి లేదా..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.బీఆర్ఎస్ సీనియర్ నేత..శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిపై ఆర్టీఐ వేశారు..ఆర్టీఐ ఇచ్చిన సమాధానంపై మాజీ మంత్రి హారీష్ రావు మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు..ఆ ప్రకటనలో సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయింది.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టిన్రు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ను జరపకపోగా పేరు మార్చి ప్రజావాణిని చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ కేవలం ఒకే ఒక్కరోజు హాజరై, 10 నిమిషాల పాటు మాత్రమే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.దీన్నిబట్టి ప్రజా దర్బార్ పట్ల ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైపోయింది. మంత్రులు అందుబాటులో ఉంటారని మాట మార్చారు. ఆ మాటా నిలబెట్టుకోలేదు.

మంత్రులకు గాంధీభవన్ కు వెళ్లేందుకు ఉన్న తీరిక, ప్రజావాణికి రావడానికి మాత్రం ఉండటం లేదు.దీంతో ప్రజావాణి పట్ల మంత్రుల చిత్తశుద్ధి ఏపాటిదో కూడా తేటతెల్లమైపోయింది.  ముఖ్యమంత్రీ రాక, మంత్రులూ రాక, చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని, కడహీనంగా వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు.

ఆ రెండు రోజుల ప్రజావాణికి రావడం, దరఖాస్తులు సమర్పించుకోవడం ఉత్త వృథా ప్రయాసే అవుతున్నదని జనం వాపోతున్నారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82 వేల 955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.అయితే, అందులో కేవలం 43 వేల 272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ కిందకు వస్తాయని మిగతావి గ్రీవెన్సెస్ పరిధిలోకి రావంటున్నారు.

గ్రీవెన్సెస్ కు సదరు అధికారులిస్తున్న నిర్వచనం ఏమిటంటే…  ఫిర్యాదు, అన్యాయం, హక్కులకు భంగం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అధికారులు వారి విధులు నిర్వహించకపోవడం, ప్రజలకు సిటిజన్ చార్టర్ ప్రకారం అందవలసిన సదుపాయాలు అందకపోవడం… వీటినే గ్రీవెన్సెస్ కింద పరిగణిస్తామంటున్నారు. 

ఈ నిర్వచనం ప్రకారం భూ తగాదాలు గానీ, భూ నిర్వాసితుల సమస్యలు గానీ, నిరుద్యోగుల సమస్యలు గానీ, వివిధ వర్గాల పేదరిక సంబంధ సమస్యలు గానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలైన విషయాలు గ్రీవెన్సెస్ కిందకు రావంటూ సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించేశారు.గ్రీవెన్స్ పరిధిలోకి రావని 50శాతం ప్రజావాణి పిటిషన్లను అధికారులు తిరస్కరించినట్లు ఆర్.టి.ఐ. కింద ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడైంది. 

ప్రజావాణికి వచ్చిన మొత్తం 82 వేల 955 పిటిషన్లలో.. గ్రీవెన్సెస్ గా గుర్తించినవి  43 వేల 272 మాత్రమే. వీటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. అట్లా పంపిన 43,272 గ్రెవెన్సులలో 27,215 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయని చెబుతున్నారు.అయితే, 27,215 గ్రీవెన్సులు పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అది నిజం కాదని,  చాలా సమస్యలను పరిష్కరించ కుండానే ఫైళ్లను క్లోజ్ చేశారని క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఫైల్ క్లోజ్ చేశారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ వరకు వస్తే, ఆశలు అడియాసలవుతున్నాయని, పడ్డ శ్రమ వృథా అవుతున్నదని ప్రజలు వాపోతున్నారు. 

కొండంత ఆశలు రేపి, గోరంత కూడా న్యాయం చేయక గోళ్లు గిల్లుకుంటున్నారు. మొత్తం మీద సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది.  ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయింది. మేనిఫెస్టోలోని మొదటి హామీ నీటిమీది రాతగా మిగిలిపోయింది అని అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *