పోలీసులకు మాజీ మంత్రి హారీష్ రావు విన్నపం..!
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఓ విన్నపం చేశారు. గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కారణాలతో పోలీసులు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, ఆదివారం సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కొల్చారంలో హెడ్ కానిస్టేబుల్ వీరంతా స్వల్పకాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ మంత్రి హారీష్ రావు తన ఆవేదనను వ్యక్తంచేశారు.
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని వాపోయారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రక్షకభటుల జీవితాలకే రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. పని ఒత్తిడి, పెండింగ్ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని ఆదివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసుల ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు.
పోలీసుల్లో ఆత్మహత్య ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘మీరు పనిచేస్తేనే సమాజానికి భద్రత.. పోలీస్ మిత్రులారా.. సమస్యలు ఏవైనా ఆత్మహత్యలు పరిషారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థయిర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత’ అని ఆయన సూచించారు.