KCR ను ఎదుర్కొలేక నాపై.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!
బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆదివారం ఇందూరు లో పర్యటించారు.. ఈ పర్యటనలో కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని అన్నారు. “మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం. మేము తప్పు చేయలేదు… భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారు.” అని తేల్చిచెప్పారు.
రాజకీయ కుట్రలో భాగంగా అక్రమ కేసులతో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత తొలిసారి నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గజమాలతో జిల్లాకు స్వాగతం చెప్పారు. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
అక్కడి నుంచి వేలాది మంది ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కు చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్ధేశించి ఎమ్మెల్సీ కవిత ప్రసంగించారు.ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాననని, తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని… దేనికీ భయపడనని తేల్చిచెప్పారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లం .. .గట్టిగా నిలబడుతాం.. ప్రజల పక్షనా పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు.
కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, ఇక రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి పేరు మర్పిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా, సోషల్ మీడియాలో ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని విమర్శించినా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. బరువు ఎత్తుకొని బాధ్యత భుజాన వేసుకున్న వాళ్లకు ఓపిక ఉండాలని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి… కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిందని, రాష్ట్రంలో పోలీసు జులుం నడుస్తున్నదని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయని విమర్శించారు.
హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని, గ్రామ గ్రామానా హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులను, కార్మికులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఊరుకుంటే ప్రభుత్వం కదలదని, కాబట్టి ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు.
డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైందని నిలదీశారు. మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వలేదని, మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని ఎండగట్టారు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం …. ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదని తెలిపారు.
గురుకులాలను నడపడానికి కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారు.. ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారని అడిగారు. అలాగే, ఉద్యోగాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి యువతను తప్పదోవ పట్టిస్తున్నారని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని వివరించారు. మహిళలక ఉచిత బస్సు అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించారని, దాంతో మహిళలే కాకుండా సాధారణ ప్రజలు, అటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని, అందుకే తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి అవమానించారని తెలిపారు. “మన తెలంగాణ తల్లి మనకు కావాలి. తెలంగాణ తల్లి మాదిరా… కాంగ్రెస్ తల్లి మీదిరా. మన పొట్టమీదనే కాదు… మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నది” అని వ్యాఖ్యానించారు.
రాబోయేది గులాబీ జెండా శకమే… అందులో సందేహమే లేదని తేల్చిచెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు. బీఆర్ఎస్ సత్తాచాటి మళ్లొకసారి నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి , ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.