టీమిండియా ఘన విజయం..!
వెస్టిండీస్ మహిళా జట్టుపై సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగులు చేసింది. టీమిండియా యువ బ్యాటర్ హర్లీన్ డియోల్(103 బంతుల్లో 16 ఫోర్లతో 115) సెంచరీతో చెలరేగింది. వన్డే క్రికెట్‌లో హర్లీన్ డియోల్‌కు ఇదే తొలి శతకం.
హర్లీన్ డియోల్‌తో పాటు ప్రతిక రవల్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 76), స్మృతి మంధాన(47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), జెమీమా రోడ్రిగ్స్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో డియాండ్ర డాటిన్, జైదా జేమ్స్, అఫీ ఫ్లేచర్, కియాన జోసెఫ్ తలో వికెట్ తీసారు. వన్డేల్లో భారత్ 350కి పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్‌పై కూడా భారత్ 358/5 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు కుప్పకూలింది. హీలీ మాథ్యూస్(109 బంతుల్లో 13 ఫోర్లతో 106) సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా(3/49) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ(2/40), టిటాస్ సధు(2/42) రెండేసి వికెట్లు పడగొట్టారు. రేణుకా సింగ్ ఓ వికెట్ తీసింది.