Cancel Preloader

కాంగ్రెస్‌కు ఏం నష్టం ..అంతిమంగా తెలంగాణకే.!.-ఎడిటోరియల్ కాలమ్..!

 కాంగ్రెస్‌కు ఏం నష్టం ..అంతిమంగా తెలంగాణకే.!.-ఎడిటోరియల్ కాలమ్..!

What a loss for Congress ..ultimately for Telangana.!.-Editorial Column..!

మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అయితే, ‘సినిమా వాళ్ల వివాదంతో సినీ పరిశ్రమ హైదరాబాద్‌ నుంచి విశాఖకు తరలిపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు. నేను రెండేండ్లకోసారి సినిమా చూస్తా. అది హైదరాబాద్‌లో నిర్మిస్తే నాకేంటి? విశాఖలో నిర్మిస్తే నాకేంటి? నేనేమీ సినిమా రంగంపై ఆధారపడి బతకడం లేదు. అందుకే, సినిమా రంగం తరలిపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు’ అని తన కుటుంబమే కేంద్రంగా బతికే సాధారణ ఉద్యోగి మాట్లాడితే తప్పేమీ కాదు. కానీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒక నిర్ణయంపై నాకేమీ నష్టం లేదని తానే కేంద్రంగా జీవించడం, నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడటం తప్పు. రాష్ట్రానికి ఎలాంటి మేలు చేస్తుంది, ఎలాంటి నష్టం చేస్తుందనే కోణంలో తన ప్రతి నిర్ణయం ఉండాలి.

అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని ఎందుకు తిరిగి ఇస్తున్నారనేది స్వయంగా ముఖ్యమంత్రే విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ‘మీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో అదానీ నుంచి అక్కడి సీఎం రేవంత్‌ రూ.100 కోట్ల విరాళం తీసుకుంటారు, మీరేమో అదానీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని ఢిల్లీలో అదానీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాహుల్‌గాంధీని విలేకరులు ప్రశ్నించారు. అందువల్ల విరాళం తిరిగి వెనక్కి ఇస్తున్నా’నని రేవంత్‌ ప్రకటించారు. అసెంబ్లీలో మాత్రం పేద యువతకు ఉపయోగపడే స్కిల్‌ యూనివర్సిటీకి విరాళమిస్తే ప్రతిపక్షం ఓర్వలేక పోయిందని, అందుకే విరాళం తిరిగి ఇచ్చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు, దానివల్ల తనకేం నష్టం లేదని, రాష్ర్టానికే నష్టమని కూడా పేర్కొన్నారు. అదానీ విరాళం గురించి ప్రస్తావించినప్పుడు తమ రాష్ట్ర యువతకు ఉపయోగపడే స్కిల్‌ యూనివర్సిటీకి విరాళం తీసుకుంటే తప్పేమిటని రాహుల్‌గాంధీని ప్రశ్నించాల్సింది. రాహుల్‌గాంధీకి ఇబ్బంది అయితే రాష్ర్టానికి నష్టం జరిగినా ఫర్వాలేదు. మరి విరాళం మాత్రమే తిరిగిచ్చి ఒప్పందాలను ఎందుకు కొనసాగిస్తున్నారు? అదానీ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందాల వల్ల రాహుల్‌గాంధీకి ఎలాంటి నష్టం లేదా? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి నిర్ణయాలు రాష్ర్టానికి ప్రయోజనం కన్నా తన స్వప్రయోజనం కేంద్రంగానే జరుగుతున్నాయి.

సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ వెళ్లినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. అసెంబ్లీలో ఈ అంశంపై సీఎం సుదీర్ఘ ప్రసంగం, ఆ తర్వాత అల్లు అర్జున్‌ ఇంటిపై రౌడీ మూకల దాడి, సినిమా వాళ్లను తిడుతూ ఒక పోలీసు అధికారి మాట్లాడటం.. ఒక దాని తర్వాత ఒకటి జరిగాయి. శాసనసభలో సినిమావారి గురించి రేవంత్‌ మాట్లాడిన తీరు దాడిచేసినవారిపై ప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

1969 తెలంగాణ ఉద్యమాన్ని సినిమావాళ్లు వ్యతిరేకించారు. ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమాన్ని బహిరంగంగానే సమర్థించారు. కానీ, మలి దశ తెలంగాణ ఉద్యమం విషయంలో సినిమావాళ్లు మౌనంగానే ఉన్నారు. సినిమా రంగంలో ఇప్పటికీ ఆంధ్రావారిదే పూర్తి ఆధిపత్యం. అదేమీ రహస్యం కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐటీ, సినిమా రంగం పరిస్థితి ఏమవుతుందనే ఆందోళన కనిపించింది. కానీ, అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ అపోహలను పటాపంచలు చేసింది.

తెలంగాణ వచ్చాక ఐటీ రంగం మరింత దూసుకువెళ్లింది. సినిమావాళ్లు నిర్భయంగా తమ పని తాము చేసుకున్నారు. ఎలాంటి అభద్రతాభావానికి లోను కాలేదు. కానీ, ఇప్పుడు వారిలో ఒక విధమైన అభద్రతాభావాన్ని పాలకులే కలిగిస్తున్నారు. అల్లు అర్జున్‌ అంశాన్ని సీఎం తన భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తున్నది.

చివరకు అల్లు అర్జున్‌ను సాటి నటులు పరామర్శించడం కూడా సీఎంకు నచ్చలేదు. ‘సరిహద్దుల్లో యుద్ధం చేసి వచ్చాడా? ఆయన కన్ను పోయిందా? కాలు పోయిందా?’ అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అయితే, ఓటుకు నోటు సమయంలో రేవంత్‌ బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు టీడీపీ నాయకులు ఆయనను పరామర్శించారు. ఈ నేపథ్యంలో మరి అప్పుడు రేవంత్‌ సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేసి వచ్చాడా? ఎందుకా పరామర్శలు? అని అప్పటి, ఇప్పటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

సినిమావారి పట్ల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఏపీ నాయకులు.. హైదరాబాద్‌ నుంచి సినిమా రంగం విశాఖకు తరలివస్తే స్వాగతిస్తామని చెప్తున్నారు. మద్రాస్‌ నుంచి వచ్చి ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి సీఎం కాగానే సినిమా రంగం మొత్తం హైదరాబాద్‌కు తరలిరాలేదు. చెన్నారెడ్డి కాలం నుంచి ప్రయత్నాలు చేయగా చంద్రబాబు కాలం నాటికి తరలివచ్చింది. అప్పుడంటే నాలుగు దశాబ్దాల కాలం పట్టింది. కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అంత సమయం పట్టదు. రేవంత్‌ భాషలో చెప్పాలంటే సినిమా రంగం తరలివెళ్లినా ఆయనకు ఎలాంటి నష్టం లేదు. వారికేమీ సినిమా వ్యాపారం లేదు.. నష్టం జరగడానికి.

సినిమా వాళ్ల పట్ల రేవంత్‌ వైఖరికి కారణం ఏమిటో తెలియాలి. రేవంత్‌ మాటలను చూస్తుంటే సినిమా రంగం పట్ల ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉన్నట్టు అనిపిస్తున్నది. కానీ, అది నిజం కాదు. తెలంగాణలో అందరి కన్నా ఎక్కువగా సినిమావారితో సంబంధాలు ఉన్నది రేవంత్‌కే. సినిమావాళ్లు అందరూ సభ్యులుగా ఉన్న జూబ్లీహిల్స్‌ క్లబ్‌కు రేవంత్‌ చాలా కాలం అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడున్న సినీ వారసులు చాలా మంది ఆయనకు ఆ క్లబ్‌లో మంచి మిత్రులు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో ఉద్యమకారులు జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలను అడ్డుకోగా.. అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్‌ రెడ్డి ఉద్యమకారుల సంగతి తేలుస్తానని వెళ్లారు. రాంగోపాల్‌ వర్మకు కూడా సినిమాలపై సలహా ఇచ్చిన అనుభవం రేవంత్‌కు ఉంది. పరిటాల రవిపై వర్మ తీసిన సినిమా పట్ల మొదటిరోజు అస్సలు స్పందన రాకపోయేసరికి.. ‘ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను అవమానించారని గొడవ చేయించండి.. పబ్లిసిటీ వస్తుంద’ని తానే సలహా ఇచ్చినట్టు గతంలో ఆయనే చెప్పారు.

అయితే, రేవంత్‌కు అంత సాన్నిహిత్యం ఉన్న సినిమావారితో ఏం జరిగిందో బయటకు రావడం లేదు. సినిమా ఫంక్షన్‌లో తెలంగాణ సీఎం పేరు గుర్తుకురాక అల్లు అర్జున్‌ తటపటాయించారు. సినిమావాళ్లపై కక్షకు ఇదే కారణమని ఓ ప్రచారం ఉంది. తన రాజకీయ గురువు బాబు కోసం సినిమా రంగం విశాఖకు తరలించాలని ఇలా చేస్తున్నారనేది మరో ప్రచారం. ఈ ప్రచారం అంత నమ్మశక్యంగా లేదు. గురువు కోసం, అనుచరుల కోసం ఆలోచించేంత విశాల హృదయం కాదు ఆయనది. ఇగో దెబ్బతినడం వల్ల అంటే కొంత నమ్మవచ్చు కానీ, గురువు కోసం త్యాగం అంటే నమ్మశక్యంగా లేదు.

తెలంగాణ ఏర్పడగానే కొత్త ప్రభుత్వం కొలువైనప్పుడు సచివాలయంలో కొందరు జర్నలిస్టులు అప్పటి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అక్కడ తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తీసిన సినిమా సీడీ కనిపిస్తే చర్చ ఆ సినిమాపైకి వెళ్లింది. ఎవరో ఔత్సాహికులు సినిమా తీశారు. విడుదల కావడం లేదు. ఎవరో ఒకరు ఆ సినిమా కొనేలా చేయాలని కేటీఆర్‌పై ఒత్తిడి. అది వ్యాపారం. లాభం వస్తుందనుకుంటే కొంటారు. మనం చెబితే ఎందుకు కొంటారనేది కేటీఆర్‌ వాదన. ఆ చర్చలో సినిమా రంగం టర్నోవర్‌ గురించి చర్చ వచ్చింది. ‘బేగంబజార్‌లోని ఓ గల్లీ టర్నోవర్‌ అంత ఉండొచ్చు. కానీ, వారి ప్రభావం చాలా ఉంటుంది. ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు’ అంటూ సినిమా రంగం ఇక్కడి నుంచి తరలివెళ్లకుండా సామరస్యంగా వ్యవహరించాలని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. సినిమా రంగం వెళ్లిపోతే తనకేం లాభం, నష్టం అనే కోణంలో కాదు, రాష్ర్టానికి ఏం లాభం, ఏం నష్టం జరుగుతుందనే కోణంలో పాలకులు ఆలోచించాలి.

సినిమా రంగం తరలివెళ్లినా, రియల్‌ ఎస్టేట్‌ పడకేసినా, రాష్ట్ర ఆదాయం పడిపోయినా రేవంత్‌కు కలిగే నష్టం ఏమీ లేదు. ఆయన అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఇంకా పైకి ఎక్కే మెట్లు లేవు. తాను తీసుకునే దుందుడుకు చర్యల వల్ల ఆయనకు నష్టం లేకపోయినా రాష్ట్రం నష్టపోతుంది.సినిమా రంగం తరలివెళ్లినా, రియల్‌ ఎస్టేట్‌ పడకేసినా, రాష్ట్ర ఆదాయం పడిపోయినా రేవంత్‌కు కలిగే నష్టం ఏమీ లేదు. ఆయన అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఇంకా పైకి ఎక్కే మెట్లు లేవు. తాను తీసుకునే దుందుడుకు చర్యల వల్ల ఆయనకు నష్టం లేకపోయినా రాష్ట్రం నష్టపోతుంది. కాంగ్రెస్‌ నష్ట పోవడానికి ఏమీ లేదు. సువిశాల భారత దేశంలో కాంగ్రెస్‌ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో మాత్రమే అధికారంలో ఉంది. ఈ మూడింట్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా అధికారం నిలబెట్టుకుంటుందా? అంటే చెప్పలేం. నిండా మునిగిన కాంగ్రెస్‌కు కొత్తగా వచ్చే నష్టం ఏముంది? అంతిమంగా కొత్తగా పుట్టిన తెలంగాణే నష్టపోతుంది.

-మురళి బుద్ధా ( తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌)

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *