సర్వమతాలకు సంపూర్ణ రక్షణ..!

 సర్వమతాలకు సంపూర్ణ రక్షణ..!

తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సర్వమత సమానత్వంలో ఎవరైనా ఇతర మతాలను కించపరిచే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.

క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని ఎల్పీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి  కేక్‌ను కట్ చేసి, అందరికీ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనల్లో సమస్త అంశాలు సంక్షిప్తమై ఉన్నాయని అన్నారు.

విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడి నిరుపేదలకు సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు. సమాజ నిర్మాణంలో ఆదర్శవంతులుగా, విద్యార్థినీ విద్యార్థులను ఒక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదర్శంగా నిలబడ్డారని అన్నారు.

క్రిస్‌మస్ పండుగ జరుపుకునే డిసెంబర్‌ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ ప్రకటన వెలువడిన నెల అని గుర్తుచేశారు. ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రమంతా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ , హైదరాబాద్ రెసిడెంట్ & ప్రిసైడింగ్ బిషప్ ఎం.ఏ. డానియల్ , ఎవాంజలిస్ట్ డాక్టర్ ఎన్ జయపాల్ , కల్వరి టెంపుల్ పాస్టర్ డాక్టర్ సతీష్ , బిషప్ రూబెన్ మార్క్ తో పాటు క్రిస్టియన్ పెద్దలు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *