గర్భిణులు, బాలింతల ఆరోగ్యం గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు..!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కనీసం పాలను కూడా సరిగా అందించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి కడుపుకొడుతున్నది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పాల కొరత పట్టి పీడిస్తున్నా కానీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు రోజు వారీగా అందించే పాలు సరఫరా కావడం లేదు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కోసం సమృద్ధిగా నిధులున్నా పాల కొరత పీడిస్తుండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వాస్తవానికి అంగన్వాడీ కేంద్రాలు ఇండెంట్ సమర్పించిన 15- 20 రోజుల్లోనే పాలు సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఒక్క సంగారెడ్డి జిల్లా పరిధిలోనే దాదాపు 100 కేంద్రాల్లో 15 రోజుల నుంచి బాలింతలు, గర్భిణులకు పాలు అందించడం లేదని తెలిసింది. పాల సరఫరాపై మంత్రి సీతక్క పేరుకే సమీక్షలు చేస్తున్నారు తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడింది లేదని అంగన్వాడీ టీచర్లే విమర్శిస్తున్నారు.