కొండా సురేఖపై చర్యలు తప్పవా…?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు…నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యలు తెచ్చి పెడుతోంది.సురేఖ శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మంత్రిగా ఉండి పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పైన ఏఐసీసీ సైతం ఇప్పటికే రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రి కొండా సురేఖ దూకుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో సమంత గురించి సురేఖ చేసిన వ్యాఖ్యల పైన పెద్ద దుమారమే చెలరేగింది. కేటీఆర్ అంశం పక్కకు పోయి..సురేఖ టార్గెట్ అయ్యారు. పరోక్షంగా ప్రభుత్వం, కాంగ్రెస్ లక్ష్యంగా మారాయి. ఆ తరువాత సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహించుకున్నా.. వివాదం మాత్రం సమిసిపోలేదు. సురేఖ పైన హీరో నాగార్జున కేసు దాఖలు చేసారు. ఈ వ్యవహారం పైన అమల నేరుగా ప్రియాంక గాంధీతో మాట్లాడారు. పార్టీ నాయకత్వం సైతం సురేఖ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.అయితే, సురేఖ పైన వెంటనే చర్యలు తీసుకుంటే రాజకీయంగా సమస్యలు వస్తాయని సీఎం రేవంత్ భావించారు.
దీంతో, సురేఖ తన వ్యాఖ్యలు ఉప సంహించుకొనేలా పార్టీ సూచించింది. ఇక, తాజాగా సొంత పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయులతో సురేఖ వర్గ మధ్య విభేదాలు పోలీసు స్టేషన్ కు చేరాయి. వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా వార్ ఓ రేంజ్లో జరుగుతోంది. ఫోటోతో మొదలైన వివాదం, తర్వాత ఫ్లెక్సీల చింపివేత, ధర్నాలు, దాడులు, అరెస్టుల దాకా వెళ్లింది. దీంతో మంత్రి రంగంలోకి దిగి పోలీస్ స్టేషన్కు వెళ్లడం..సీఐ కుర్చీలో ఆమె కూర్చోవడం మరో వివాదానికి కారణమైంది. తమ వారిని విడిచి పెట్టాలని మంత్రి హోదాలో సురేఖ చెప్పటం మరింత వివాదంగా మారింది. సురేఖ దూకుడు స్వభావం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యగా మారుతోంది. దీంతో..సురేఖ తీరు ఇదే విధంగా ఉంటే త్వరలోనే చర్యలు తప్పవనే సంకేతాలు పార్టీ నుంచి ఇస్తున్నట్లు సమాచారం.