నెయ్యా.. నూనా.. క్రూడాయిలా?
తిరుమల వేంకటేశ్వరస్వామి నైవేద్యాలకు వినియోగించే నెయ్యి రూ.1,600కు కొని, భక్తులకు పంపిణీ చేసే లడ్డూలకు వాడే నెయ్యి రూ.320కి కొనడం ఏంటని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.రూ.320కి కొనేది నెయ్యా.. నూనా.. క్రూడాయిలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్తీపై కేంద్రసంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆమె విజయవాడలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.
నెయ్యి కల్తీకి బాధ్యులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేయాలని అడిగే హక్కు వైకాపాకు లేదని, వారి పాలనలోనే కల్తీ జరిగిందని గుర్తు చేశారు. నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడ్డారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పల్లంరాజు, మస్తాన్‌వలీ, ఆమంచి కృష్ణమోహన్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.