బీఆర్ఎస్ పోరాటానికి దిగోచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్ మార్చి 7 (సింగిడి)
తెలంగాణలో ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాలలో రిజర్వేషన్స్ కల్పిస్తూ శాసనసభలో మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం బీఆర్ఎస్ పోరాటాల ఫలితమేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.బీసీల న్యాయమైన హక్కులు, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా సాధనకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు.
మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ” కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని, నివేదిక తప్పులతడకగా ఉందని తమ పార్టీ లెక్కలతో సహా నిరూపించడంతో ప్రభుత్వం రీసర్వేకు అంగీకరించడాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.బీసీలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలంటూ,రాష్ట్ర మంత్రిమండలిలో సముచిత స్థానం లభించకపోవడంపై నిలదీయడం,కామారెడ్డి డిక్లరేషన్ అమలునకు బీఆర్ఎస్ పట్టుపట్టడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదని పేర్కొన్నారు.
అసెంబ్లీలో కేవలం బిల్లులు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోవడంతోనే సరిపెట్టకుండా,వాటి అమలునకు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో పార్లమెంటులో కొట్లాడితే తమ పార్టీ మద్దతునిస్తుందని ఎంపీ వద్దిరాజు చెప్పారు.అదేవిధంగా, కేంద్రంపై మరింత వత్తిడి పెంచి ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయించాలని,రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 పదవులను బీసీలకిచ్చి ప్రాధాన్యత కలిగిన శాఖలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.