బాబుకు దడపుట్టిస్తోన్న తమ్ముళ్ళ తీరు..!
ఏపీలో వరదలతో .. భారీ వర్షాలతో ఆగమాగమైన విజయవాడ ప్రజలను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఎంతగా కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. రాత్రి అనక పగలు అనక విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ బాధితులకు నేను సైతం అండగా ఉంటానని అనేక చర్యలు తీసుకుంటూ ఒక పక్క అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో పక్క మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి రాష్ట్ర పాలనను గాడిన పెడుతున్నారు.
ఇది అంతా ఇలా ఉంటే మరోవైపు టీడీపీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలు తమ దారి రహాదారి అంటూ చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు.. మొన్న సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన పార్టీకి చెందిన ఓ మహిళ నాయకురాల్ని లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా అత్యాచార యత్నానికి పలుమార్లు పాల్పడ్డాడని ఏకంగా పార్టీ నుండే సస్పెండ్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ వివాదాన్ని మరిచిపోకముందు మరోవైపు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డ్వాక్రా గ్రూపు మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు..
అంతే కాకుండా అందులో ఒక మహిళను సైతం పోలీస్ స్టేషన్ లో పెట్టి ఐదారు రోజులు ఉంచడం గమనార్హం. ఈ ఇష్యూ మరిచిపోకముందే మరో ఎమ్మెల్యే ఉదాంతం వెలుగులోకి వచ్చింది.కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాజాగా రెచ్చిపోయారు. ఆమె మాట్లాడుతూ ” నాదగ్గర రెడ్ బుక్ ఉంది. మంత్రి నారా లోకేశ్ నాయుడు దగ్గర ఉన్న రెడ్ బుక్ మాదిరి నాదగ్గర సైతం వందమంది పేర్లతో ఓ రెడ్ బుక్ ఉంది. అధికారంలో ఉన్న.. అందులో ఎమ్మెల్యేను.. మీ అందరి అంతును చూస్తాను అని వార్నింగిచ్చిన ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇప్పటికే రెడ్ బుక్ అంటూ నానా హాంగామ చేసిన నారా లోకేష్ నాయుడి వల్ల జరిగిన ప్రమాదాన్ని నివారించే పనిలో ఉన్నాడు చంద్రబాబు. ఆ సమయంలోనే ఈ వరదలు రావడంతో ఆ రెడ్ బుక్ కాస్తా రెయిన్ లో కొట్టుకుపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి మంత్రులు లోకేశ్, అనిత,రామానాయుడు సహా తదితరులు ప్రజలకు సాయం చేస్తుండటంతో అది కాస్తా మరుగున పడింది.
వీళ్లు ఇలా ఉంటే మరోవైపు తెలుగు తమ్ముళ్లు రెడ్ బుక్ అంటూ . అధికారం ఉందని ప్రజలను కార్యకర్తలను నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ చంద్రబాబు కు కొత్త తలనొప్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు ఒకరి తర్వాత ఒకరూ తమ తమ ఛేష్టలతో బయటకు వస్తున్నారు. బాబు గారు ఈ వరదల తర్వాత ఓ కన్నెయకపోతే మాత్రం పుట్టి పెరిగిన తమ్ముళ్ళే బాబును ముంచేలా ఉంటారు.