యాసంగి కి సాగునీళ్లు అందిస్తాము

కల్వకుర్తి మార్చి 7 (సింగిడి
యాసంగి పంటలకు సాగునీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలి.. ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కల్వకుర్తి ఎత్తపోతల పథకం పరిధిలోని యాసంగి పంట కోసం పస్పుల బ్రాంచ్ కెనాల్ నుంచి రైతులతో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు.
బైక్ పై తిరుగుతూ.. కాల్వ గట్లను పరిశీలించారు. నీటిని విడుదల చేయడంతో కోడేరు, పానగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండల రైతుల పంట సాగుకు సాగునీరు అందుతుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అడిగిన వెంటనే నీటిని విడుదల చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగు నీటిని పొదుపుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పంటలు కోతకు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచేలా వారి సంక్షేమం, అభ్యున్నతికి సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఒకే సారి రూ. 2 లక్షల పంట రుణాలను మాఫీ చేశామని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా, సన్నాలకు రూ. 500 బోనస్ వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.