వరుణ్ చక్రవర్తికి బెదిరింపులు

ఒక్క టోర్నమెంట్‌తో టీమిండియాకు కొత్త హీరోగా అవతరించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ భారత్ కప్పు గెలవడంలో వరుణ్ చక్రవర్తి ప్రధాన కీలక పాత్ర పోషించాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి వరుణ్ చేతికి బంతి ఇస్తూ ఫలితం సాధించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
అతడ్ని ట్రంప్ కార్డుగా వాడుకొని ప్రత్యర్థుల పనిపట్టాడు. చాన్నాళ్లు టీమ్‌కు దూరమై ఇబ్బందులు పడిన వరుణ్.. చాంపియన్స్ ట్రోఫీతో టీమ్‌లో తన స్పాట్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే ఊపులో ఐపీఎల్-2025లోనూ అదరగొట్టాలని చూస్తున్నాడు. అలాంటోడు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
భారత్‌కు వస్తే చంపేస్తామనని తనను బెదిరించారని అన్నాడు వరుణ్ చక్రవర్తి. టీ20 వరల్డ్ కప్-2021 తర్వాత తాను భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పాడు మిస్టరీ స్పిన్నర్. అవి తన జీవితంలో చీకటి రోజులని తెలిపాడు. ఇండియాకు వచ్చే ధైర్యం చేస్తే మిగలవని వార్నింగ్ ఇచ్చారని అతడు గుర్తుచేసుకున్నాడు.
ఆ సమయంలో భయపడి దాక్కోవాల్సి వచ్చిందన్నాడు. కొందరైతే తనను బైక్ మీద ఫాలో అయి భయపెట్టారన్నాడు. దీంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని అతను పేర్కొన్నాడు. ఆ తర్వాత కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నించినా తనను సెలెక్టర్లు పట్టించుకోలేద న్నాడు. టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కంటే రీఎంట్రీ కష్టమనేది అర్థమైందని తెలిపాడు.
