మెకానిక్ రాకీ రివ్యూ….!
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ కెరీర్ బిగినింగ్ నుంచి కాస్త విభిన్నమైన కథలే ఎంచుకుంటున్నాడు. జయాపజయాలతో పని లేకుండా తనవంతుగా ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జనాల నోటిలో తన సినిమా ఉండేలా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటాడు.తాజాగా విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము.
విడుదల తేది: 22–11–2024
నటీనటులు: విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి , శ్రద్దాశ్రీనాథ్, సునీల్, హర్షవర్ధన్, వీకేనరేశ్, వైవా హర్ష, హైపర్ ఆది తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి
ఎడిటింగ్: అన్వర్ అలీ
సంగీతం:జేక్స్ బిజోయ్
నిర్మాణ సంస్థ: ఎస్‌ఆర్‌టీ
నిర్మాత : రజనీ తాళ్లూరి
దర్శకత్వం:రవితేజ ముళ్లపూడి
కథ:
రాకీ (విశ్వక్‌సేన్ ) అంతంత మాత్రంగా చదివే ఓ కుర్రాడు. తండ్రి రామకృష్ణ(నరేష్)కు ఓ మెకానిక్ గ్యారేజీ కమ్ డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది. చదువు మీద శ్రద్ధలేకపోవడంతో రాకీ కూడా తండ్రి నడిపే షెడ్ పని చేయాల్సి వస్తుంది. తను నడిపే డ్రైవింగ్ స్కూల్‌కి రాకీ స్నేహితుడు శేఖర్ చెల్లి ప్రియా (మీనాక్షి చౌదరి) మాయ (శ్రద్ధా శ్రీనాధ్) డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తారు. రాకీ షెడ్డు ఉన్న స్థలంపై రంకి రెడ్డి (సునీల్) కన్ను పడుతుంది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కాజేయాలనుకొంటాడు. దాన్ని అడ్డుకోవాలంటే రాకీకి రూ.50 లక్షలు కావాలి. మరి ఆ రూ.50 లక్షలు ఎలా సంపాదించాడు? రాకీ స్నేహితుడు శేఖర్ ఎందుకు చనిపోయాడు? ఇన్సూరెన్స్ పేరుతో జరిగిన స్కామ్‌లో మాయ (శ్రద్దా శ్రీనాథ్) పాత్ర ఏంటి? అన్నది తెరపైనే చూడాలి.
విశ్లేషణ:
ఒక ఆత్మహత్యతో సినిమా ప్రారంభమవుతుంది. చనిపోయింది ఎవరు.. ఏంటి అనేది చెప్పకుండా కాసేపు అంతా సీరియస్‌గా నడుస్తోంది. ఆ తదుపరి హీరో రాకీ కథలోకి ఫన్నీగా తీసుకెళ్లాడు దర్శకుడు. మొదటిభాగం అంతా రాకీ కాలేజ్, ప్రియాతో ప్రేమ, తండ్రితో తిట్లు.. గ్యారేజ్ గొడవ, దానిని కాపాడుకోవడానికి పడే పాట్లతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అంతకు మించి ప్రథమార్ధంలో ఆసక్తికర అంశాలు లేదు. హీరోయిన్ మీనాక్షి చౌదరిని పిసినారిగా చూపించడం కాస్త ఫన్ క్రియేట్ చేసింది. దొంగ బ్యాగ్ కొట్టేేస సీన్ నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్ ప్రారంభంలో అసలు కథ మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా ఫన్ రైడ్‌తో లవ్‌స్టోరీలాగా నడిచిన కథ ఒక్కసారి టర్న్ అవుతుంది.
లవ్ జానర్ అనుకున్న కథ క్రైమ్ జానర్‌లో సాగే థ్రిల్లర్‌గా మారిపోతుంది. మొదటి ట్విస్ట్‌తో కథ ఏంటి అనేది అర్థమవుతుంది. సెకండ్ ట్విస్ట్ ప్రేక్షకుడి ఊహకు అందనిదే. ఆ విషయంలో పాత్రల్ని ట్విస్ట్‌లకు అనువుగా వాడుకోవడం బాగుంది. ఫస్టాఫ్ సాగదీతగా సాగడంతో ద్వితీయార్థమే సినిమాకు బలంగా నిలిచింది. ఫస్టాఫ్ డీటెయిల్ చెబితే రెండో భాగంలో మలుపుల్ని ప్రేక్షకుడు ఊహించేస్తాడేమో అని ఫస్టాప్‌ను డల్‌గా చూపించాడు దర్శకుడు అనిపిస్తుంది. అయితే దర్శకుడి పూర్తి దృష్టి సెకెండాఫ్ మీదే. మధ్య తరగతి ఆశ, అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు చేసే మోసాలను ఇందులో చూపించారు.
ఇన్సూరెన్స్ పేరుతో జరుగుతున్న సైబర్ క్రైం, ఆ మోసగాళ్ల ప్లాన్స్ ఎలా ఉంటాయనేది.. దానిలో ఎత్తులు, పైఎత్తులను బాగా డీల్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ సహజత్వం లోపించింది. వాణిజ్య అంశాలు కాస్త ఎక్కువయ్యాయి. ఫస్టాఫ్‌ను కాస్త ఓపికగా చూస్తే సెకెండాఫ్ ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసేస్తుంది. ట్విస్ట్‌లు, టర్న్‌లు ఆలరించాయి కానీ ఎమోషన్ మిస్ అయింది.
నటీనటుల పనితీరుకొస్తే:
విశ్వక్ ఎనర్జీ ఎనర్జీని దర్శకుడు బాగా వాడుకున్నాడు. సినిమా మొత్తం అతని చుట్టూ తిరుగుతుంది. తనదైన మాస్ స్టైల్‌ని చూపించాడు. మాస్ డైలాగులు తనదైన స్టైల్‌లో చెప్పి మెప్పించాడు. ఫైట్లు, డాన్స్‌లలో కూడా వైవిధ్యం చూపించాడు. మీనాక్షి చౌదరి పద్దతి గల పాత్రలో మెప్పించింది. ఆ పాత్రలతో పాటు శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్ర కూడా సినిమాకు కీలకం. గ్లామర్‌కు పరిమతం కాకుండా ఇద్దరి పాత్రలకు పాధాన్యం కల్పించారు. అయితే శ్రద్ధా శ్రీనాథ్ ఏజ్ మీద పడినట్లుగా కనిపించింది. సినిమాలో అసలు ట్విస్ట్ ఆమె నుంచే మొదలవుతుంది. నరేష్ తన పాత్ర మేరకు నటించారు. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్వించాడు. హర్షవర్థన్ పాత్ర ఫర్వాలేదు. సునీల్‌ని మొదట్లో పెద్ద డాన్‌లా చూపించి పిల్లిని చేసేశారు.
అయితే క్లైమాక్స్‌కి వచ్చేసరికి సునీల్ పాత్ర అలా అనిపించదు. జేక్ బిజోయ్ పాటలు, సంగీతం బావున్నాయి. కెమెరా పనితనం సినిమాకు ఎసెట్. రజనీ తాళ్లూరి సంస్థకు తగ్గట్టు నిర్మాణ విలువలు బావున్నాయి. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కత్తెర వేసుంటే బావుండేది. ఇక దర్శకుడు రవితేజకు ఇది తొలి సినిమా. రాసుకున్న కథ, తను చెప్పాలనుకున్నది కరెక్ట్‌గానే ఉన్నా.. అక్కడక్కడా తడబాటు కనిపించింది. తను పూర్తి సెకెండాఫ్ ట్విస్ట్‌ల మీదే ఆధారపడినట్లు అనిపించింది. ఫస్టాఫ్‌కు ఇంకాస్త వర్క్‌వుట్ చేసి ఎమోషన్స్ జోడించి ఉంటే బావుండేది. సెకండాఫ్‌ని డీల్ చేసిన పద్థతి బాగుంది. పూర్తిగా ట్విస్టుల్ని నమ్ముకొన్న కథ కావడంతో ఆ ట్విస్ట్‌ల కోసం ఫస్టాఫ్ ఓపికగా చూడాలి. ఈ మధ్యకాలంలో విశ్వక్ నుంచి వచ్చిన చిత్రాల్లో ఇది మంచి చిత్రమనే చెప్పాలి. థ్రిల్లింగ్ ట్విస్ట్‌ల కోసం సినిమా చూడొచ్చు.