కులగణన చాలా పారదర్శకంగా జరిగింది..!

 కులగణన చాలా పారదర్శకంగా జరిగింది..!

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సామాజిక న్యాయం అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే సమాచారాన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, సామాజిక పరంగా తీసుకునే నిర్ణయాలకు తప్పనిసరిగా వాడుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో కుల గణన సర్వే జరుగొద్దని కుట్రదారులు తప్పుడు ప్రచారం చేసి సర్వేలో పాల్గొనద్దని పిలుపు ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను అర్థం చేసుకొని సర్వే విజయవంతం కావడానికి ప్రజలు సహకరించి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారన్నారు. కొన్ని దశాబ్దాలుగా కొన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్న కుల గణన సర్వే పూర్తి చేసి చట్టసభలో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కులగణన చాలా పారదర్శకంగా, శాస్త్రీయంగా జరిగిందని వివరించారు.‌

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కుల గణన సర్వే మొదలుపెట్టడానికి సుదీర్ఘంగా కసరత్తు చేశామని వివరించారు. 4 ఫిబ్రవరి 2024 న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, 16 ఫిబ్రవరి 2024న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. 10 అక్టోబర్ 2024 న సర్వే కోసం జీవో విడుదల చేశామన్నారు. సర్వే పర్యవేక్షణకు సీనియర్ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన 19 అక్టోబర్ 2024 న సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్ గా విభజించి తద్వారా 94,261 బ్లాక్ లను ఏర్పాటు చేశామన్నారు.

గత కులగణన సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు ఆసక్తి కనబరిచి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. ఈ కులగణన సర్వే దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియగా ఉపయోగపడుతుందన్నారు. మరి కొద్ది రోజుల్లోనే మీడియా మిత్రుల సమావేశం నిర్వహించి కుల గణన సర్వేకు సంబంధించిన అంశాలను డిటైల్డ్ గా ప్రజెంటేషన్ చేసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. సర్వే సక్సెస్ కావడానికి మెండుగా సహకరించిన ప్రజలకు, మీడియా మిత్రులకు, శాస్త్రీయంగా సర్వే చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *