టాలీవుడ్ నిర్మాతమండలి కీలక నిర్ణయం..!

telugu film producers council
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు.
ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో నిర్మాతలు నిర్ణయించారు. అయితే తాము ముప్పై శాతాన్ని పెంచడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. మొదటి విడతలో పదిహేను శాతం వేతనం పెంచడానికి ఓకే చెప్పారు. అయితే రెండో విడతలో ఐదు, మూడో విడతలోనూ ఐదు శాతం వేతనాలను పెంచడానికి ప్రతిపాదనలు చేశారు. ఈ పెంపు నిర్ణయం మాత్రం చిన్న సినిమాలకు పని చేసే కార్మికులకు వర్తించదని స్పష్టం చేశారు. చిన్న సినిమాల నిర్మాతలకు భారం కాకూడదనే ఈ నిర్ణయం అని ఫెడరేషన్ కు స్పష్టం చేశారు.
మరోవైపు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సైతం ఫెడరేషన్ తో చర్చలు సఫలం కాకపోతే తాము రంగంలోకి దిగుతామని ఇప్పటికే ప్రకటించారు. ఇంకోవైపు ఈ నెల పదకొండు తారీఖున ప్రభుత్వం తరపున నిర్మాత మండలితో పాటు సినీ కార్మికులతో చర్చలు జరుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో నిత్యం పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వేతనాలను ముప్పై శాతం పెంచితే తప్పేంటని మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.