ప్రశాంత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలు.

రానున్న శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో శ్రీ రామ నవమి వేడుకల సమయంలో మత సామరస్యం కాపాడేలా, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే శోభాయాత్ర వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. తమ పరిధిలో మతసామరస్యానికి కృషి చేస్తున్న వివిధ వర్గాల మతపెద్దలు మరియు శాంతి కమిటీ సభ్యుల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ విభాగపు అధికారులు మరియు సిబ్బంది శోభాయాత్ర ఊరేగింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ప్రదేశాల్లో బాంబు తనిఖీ బృందాల ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఊరేగింపుల్లో పాల్గొనే సమయంలో మహిళలు ఎటువంటి వేధింపులకు గురికాకుండా షి టీమ్స్ బృందాలు ఎల్లవేళలా విధుల్లో ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా తమ పండుగలు జరుపుకోవాలని, తమ చర్యల ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా, ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నిర్వహణ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కమిషనర్ గారు పలు సూచనలు చేశారు. స్టేడియం పరిసరాలలో ఉన్న సిసిటీవీల ద్వారా నిరంతర నిఘా ఉండాలని, భారీ స్థాయిలో ప్రేక్షకులు హాజరవుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విదుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డిసిపి స్పెషల్ బ్రాంచ్ జీ నరసింహారెడ్డి, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ నరసింహా రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-1 మల్లారెడ్డి, డీసీపీ ట్రాఫిక్-2 శ్రీనివాసులు, డిసిపి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, డిసిపి శ్యామ్ సుందర్, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
