సౌందర్య గురించి మీకు తెలియని విషయాలు..!

6 total views , 1 views today
సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం,హిందీ భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఈమె 100కు పైగా చిత్రాలలో నటించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి సినిమాలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు.
అమ్మోరు సినిమా విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా ‘రైతు భారతం’. ఈ సినిమాలో హీరో కృష్ణ మరదలిగా, భానుచందర్ సరసన నటించింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు ‘మనవరాలి పెళ్లి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రైతు భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలైంది. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమాలో కూడా నటించింది.
హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ సినిమాలో నటించింది. సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ సినిమా, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది. సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది. ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఆమె సోదరుడు, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించాడు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి సినిమా “ఆప్త మిత్ర” విజయవంతమైంది. ఆమె జ్ఞాపకార్ధం “సౌందర్య స్మారక పురస్కారం”ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు. ఆమె తండ్రి శ్రీ సత్యనారాయణ ఓ పేరున్న జ్యోతిష్యుడు ఆయన సౌందర్య కేవలం సినీ ఇండస్ట్రీ లో 10 ఏళ్ళు మాత్రమే ఉంటుంది అని నిర్మాత శ్రీ చిట్టి బాబుకు చెప్పారట అంతే గాని పదేళ్ల సినీ జీవితం తరువాత మనలని వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పలేదు అంటున్నారు శ్రీ చిట్టి బాబు. ఏది ఏమైనా ఓ అందమైన టాలెంటెడ్ హీరోయిన్ ను చిత్ర సీమ ప్రేక్షకులు కోల్పోయారు.
