చర్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరాముల పేరు..!

చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్మరిస్తూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు వారి పేరును పెట్టాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు, సంస్కృతికి గర్వకారణమైన పొట్టి శ్రీరాములు గారు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల కోసం వారు ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు.సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు ఉండాలని పోరాడిన పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష వారి నిస్వార్థ త్యాగానికి, తెలుగువారికి గర్వకారణంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ రైల్వే టర్మినల్ ఏర్పాటు ద్వారా తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పనలో అదనపు ప్రయోజనం చేకూర్చిందని, తెలంగాణ రైజింగ్ దార్శనికతకు ఇదెంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న తమ లక్ష్య సాధనకు ఈ కొత్త రవాణా కేంద్రం ఉపయుక్తంగా చేశారంటూ రైల్వే మంత్రి గారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. తెలుగు ప్రజల కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాలకు గుర్తుగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు వారి పేరును పెట్టి గౌరవించుకోవలసిన అవసరం ఉందని, వారి అసమాన అంకిత భావానికి నివాళిగా భావిస్తున్నామని అన్నారు.
మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును మార్చాలని కోరుతున్నాం. ఈ విషయంలో మీరందించే సహకారం ఒక గొప్ప అడుగు అవుతుంది. తెలంగాణ ప్రజలు, తెలుగు మాట్లాడే ప్రజలందరూ దీనిని ఎంతగానో అభినందిస్తారు. మా విజ్ఞప్తి విషయంలో సానుకూలంగా స్పందిస్తారని.. ఆ లేఖలో ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
