నర్సంపేట నియోజకవర్గంలో మూకుమ్మడిగా మెరుపు నిరసనలు..

Peddi Sudharshan Reddy MLA
నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన ఉద్యమం చేసిన, ఆందోళన, నిరసనలు ఏది చేసినా సంచలనమే..నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఆయన రాజకీయ చతురత, వ్యూహం ఎవరికి అంతు చిక్కదు. ఏక కాలంలో నియోజకవర్గ పరిధిలోని 179 గ్రామాల్లో మెరుపు నిరసనలు చేపట్టారు..వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాడర్ కు ఒక్క పిలుపు తో నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ రైతులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేశారు.
రాత్రి 10 గంటలకు అన్ని గ్రామాల్లో ని పార్టీ అధ్యక్షులకు, ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చాలా కీలక విషయాలు క్యాడర్ కు చెప్పినట్లు సమాచారం. రైతులకు ముమ్మరంగా వ్యవసాయ పనులు వుండటంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆయా గ్రామాల్లో చావడి వద్ద ప్లే కార్డులతో నిరసన తెలుపాలని సూచించారు. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, హైవేల పైకి రోడ్డు పైకి రాకుండా నిరసనలు చేపట్టాలని సూచించడంతో పెద్ది ఆదేశాలతో నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతులు రుణాలు మాఫీ, రైతు బంద్, రైతు భరోసాతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరసన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం చేర వేయగా శాంతియుతంగా నిరసన చేస్తే అడ్డుకోవద్దని సూచించినట్లు సమాచారం. దీంతో ఏ గ్రామంలో కూడా అరెస్టు లు లేకుండా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పక్కా వ్యూహం తో అన్ని గ్రామాల్లో నిరసనలు చేపట్టేలా క్యాడర్ సమయాత్తం చేయడం లో సక్సెస్ కావడంతో మాజీ మంత్రి, పార్టీ అధ్యక్షుడు కెటీఆర్ అభినందించినట్లు తెలిసింది.
