డిప్యూటీ సీఎంగా లోకేశ్..!
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బంఫర్ విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో కూటమి మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది.
అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. మంత్రి పదవులు ఆయా పార్టీలకు సరైన నిష్పత్తిలో పంచుకున్నాయి. తాజాగా ఓ సరికొత్త డిమాండ్ తెరపైకి వస్తుంది.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్ (మహాసేన రాజేష్) మాట్లాడుతూ “టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్‌ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలి.
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నారా లోకేష్ చాలా కష్టాలు పడ్డాడు..ఎన్నో అవమానాలను ఎదుర్కున్నాడు. నాడు నారా లోకేష్ పడ్డ కష్టం వల్లే టీడీపీకి 134 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. నారా లోకేష్ అభిమానులుగా ఆయన్ని మూలన చూడడం మాకు నచ్చట్లేదు “అని మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారు.