నిర్మాతలతో కార్మిక సంఘాల చర్చల విఫలం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికుల వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేతనాల పెంపుపై నిర్మాతలతో కార్మికప ఫెడరేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని , ముప్పై శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. ఫెడరేషన్ ను విభజించేలా నిర్మాతల ప్రతిపాదనలు ఉన్నాయని అనిల్ వల్లభనేని తెలిపారు. చర్చలు విఫలమైన నేపథ్యంలో రేపట్నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.
మరోవైపు తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో నిర్మాతలు నిర్ణయించారు. అయితే తాము ముప్పై శాతాన్ని పెంచడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. మొదటి విడతలో పదిహేను శాతం వేతనం పెంచడానికి ఓకే చెప్పారు. అయితే రెండో విడతలో ఐదు, మూడో విడతలోనూ ఐదు శాతం వేతనాలను పెంచడానికి ప్రతిపాదనలు చేశారు. ఈ పెంపు నిర్ణయం మాత్రం చిన్న సినిమాలకు పని చేసే కార్మికులకు వర్తించదని స్పష్టం చేశారు. చిన్న సినిమాల నిర్మాతలకు భారం కాకూడదనే ఈ నిర్ణయం అని ఫెడరేషన్ కు స్పష్టం చేశారు.