బీసీలంటే కాంగ్రెస్ & బీజేపీలకు ఇంత చులకనా?-ఎడిటోరియల్ కాలమ్..!

 బీసీలంటే కాంగ్రెస్ & బీజేపీలకు ఇంత చులకనా?-ఎడిటోరియల్ కాలమ్..!

Is BC so easy for Congress & BJP?

Loading

మన భారతదేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీ వర్గాల సంఖ్య ఉన్నప్పటికీ, 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేయలేదు. ఇది ఈ దేశాన్ని ఇప్పటివరకూ పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి నిదర్శనం. బీసీలకు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నట్టయితే వారి సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, పరిష్కారానికి ఒక అధికారిక వేదిక ఉంటుందని టీఆర్ఎస్ మొదటినుంచీ భావిస్తున్నది. అందుకే, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు గారు ఉన్నపుడు కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ అవసరాన్ని కేంద్రానికి పలుమార్లు గుర్తు చేస్తూ, డిమాండ్ చేశారు.


తెలంగాణ ఏర్పడిన వెంటనే తొలి శాసన సభా సమావేశాలలోనే 2014 జూన్ 14 నాడు బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ కేంద్రం ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనేది శుష్క నినాదమేననీ, బిజెపి ప్రభుత్వ ఎజెండాలో బీసీ కులాల వికాసం లేనే లేదని స్పష్టంగా తేలిపోయింది. అందుకే ఇప్పటికీ బిజెపి అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిని దేశంలోని అన్నివర్గాలూ నిరసిస్తున్నాయి.
భారతదేశ జనాభాలో యాభై శాతానికి పైగా వెనుకబడిన వర్గాల ప్రజలే ఉన్నారు.

కానీ, వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు మాత్రం లభించడం లేదు. దీనికిగల ప్రధాన కారణం దేశంలో బీసీ కులాలకు సంబంధించిన ఖచ్చితమైన, గణాంకాలు లేకపోవడమే. ఒక దేశం సామాజిక సమగ్ర స్వరూపాన్ని అవగాహన చేసుకోవడంలో గణాంకాలు కీలకపాత్ర వహిస్తాయి. ‘‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్’’గా పేరుగాంచిన ‘మహాలనోబిస్’ పేర్కొన్నట్టు “statistics without planning has no fruit, planning without statistics has no root.” ప్రణాళిక లేని గణాంకాలతో ఫలితం ఉండదు, గణాంకాలు లేని ప్రణాళికలతో ప్రయోజనం ఉండదు.


1953లో ఏర్పాటు చేసిన కాలేల్కర్ కమిషన్ ఆ తర్వాత వచ్చిన అనేక కమిషన్లు బి.సి. వర్గాల జనగణన చేయాలని సిఫార్సు చేశాయి, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుండి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకూ ఎవరి ప్రభుత్వమూ ఆయా కమిషన్ల సిఫార్సులను పట్టించుకున్న పాపాన పోలేదు. పదే పదే తాను బి.సి.వర్గానికి చెందిన వాడినని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ సైతం బి.సి.ల జనగణన జరపడానికి ముందుకు రాకపోవడం బి.సి.వర్గాల పట్ల బీజేపీకి ఉన్న చిన్నచూపునకు నిదర్శనంగానే భావించవచ్చు.

దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీల కులగణన చేయకుండా, బీసీ వర్గాల అభివృద్ధిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. కేంద్ర విధానాలతో విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే తగిన వివరాలు లేకుండా ఏ వర్గాన్నయినా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ చెప్పిన మాట ఆలోచింపదగినది. కచ్చితమైన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికా రచన, విధాన నిర్ణయాలు జరగాలనేది ప్రాథమిక అవగాహన. అందుకే తెలంగాణ ఏర్పడిన వెంటనే ఆనాటి సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా జరిపి, రాష్ట్రంలోని ప్రజల మొత్తం వివరాలను ఒకే ఒక్క రోజులో సేకరించటం గమనార్హం.


“అభివృద్ధి ఫలాల పంపిణీలో జరిగే అవకతవకలన్నింటికీ నిర్దిష్టమైన గణాంకాలు లేకపోవటమే ప్రధాన కారణం” అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే అంటుంటారు. సామాజిక గణాంకాల ఆవశ్యకత, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రాధాన్యత తెలిసిన నాయకుడు కావటం వల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ‘సమగ్ర కుటుంబ సర్వే’ను ఒకే ఒక్కరోజులో సమర్థవంతంగా నిర్వహించారు. నేడు దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నిర్దిష్టమైన, సమగ్రమైన, స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికలు రూపకల్పన చేయడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం పదేండ్లుడా అట్టడుగుస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సక్రమంగా అందించగలుగుతున్నది.


ఖచ్చితమైన గణాంకాలతో మాత్రమే అభివృద్ధి, సంక్షేమంలో బి.సి. వర్గాలకు న్యాయమైన వాటా లభిస్తుంది. కానీ ఈ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయడంలో దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ విఫలమయ్యాయి ఈ నిర్లక్ష్యం వల్ల 75 సంవత్సరాల కాలంలో దేశంలోని బీసీ వర్గాలకు దక్కాల్సిన లక్షల కోట్ల లబ్ది చేకూరలేదు. సామాజిక న్యాయం లభించలేదు బీ.సీ. వర్గాల జీవితాల్లో రావాల్సిన వెలుగు రాకుండా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపిలు అడ్డుకున్నాయి. అందుకే, రాబోయే కాలంలో కేంద్రం జరపబోయే జనాభా గణనలో కులాల వారీగా బీసీ వర్గాల జనాభా లెక్కలు సేకరించాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు 2021 అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపింది. అయినప్పటికీ ఈ అంశంపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణిని అవలంభిస్తూ, బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నది.


బీసీల వివరాల సేకరణ విషయంలో గతేడాది సుప్రీంకోర్టు ముందు కేంద్రప్రభుత్వం తన అశక్తతను వ్యక్తం చేసింది. 2011 నాటి జనగణన సందర్భంగా సేకరించిన బీసీల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయనీ, ఈ నేపథ్యంలో ఇకముందు ఈ వివరాల్ని సేకరించలేమని కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. బ్రిటిష్‌ హయాంలో మన దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఇప్పటికీ అవే లెక్కలపై ఉజ్జాయింపుగా ఆధారపడతామనడం ఆశ్చర్యం. పరాయి పాలకుల స్థాయిలో కూడా మనం వివరాలు సేకరించుకోలేమా? ఈ కీలకమైన అంశంపై బీజేపీ ఎన్నికల ముందు ఒకతీరు, తర్వాత మరోతీరుగా మాట మార్చడం గర్హనీయం.

స్వయంగా బీసీ అయికూడా బీసీ గణన గురించి ఏనాడూ మాట్లాడని నరేంద్రమోదీ, ఎన్నికలకు ముందు 2018లో బీసీ కులగణన చేపడతామని, రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని మర్చిపోయారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ కూడా బీసీ వర్గాలకు చెందిన వారైనా వారేనాడూ బీసీల కులగణన గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
కులాల వివరాలు సేకరిస్తే వైషమ్యాలు పెరుగుతాయనేది అర్థం లేని వాదన. సామాజిక అంతరాలు తొలగించి, సామరస్యం సాధించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడే వైషమ్యాలు చోటుచేసుకుంటాయి.

అంతే గానీ గణాంకాలు సేకరించడం వల్ల కాదు. జనగణన అంటే అడవిలో జంతువులను లెక్కించినట్టు కాదు. ప్రజల సమగ్ర వివరాలు విధానకర్తలకు, సామాజిక పరిశోధకులకు ఉపయోగపడాలి. ఏయే ప్రాంతాలలో, ఏయే వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలువకుండా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడమంటే చీకట్లో బాణం వేసినట్లే ఉంటుంది. సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలున్న మన సమాజంలో గణాంకాలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. కేంద్రం కులాలవారీ జనగణన అవసరాన్ని గుర్తించాలి.ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వేలో బీసీ వర్గాల జనాభాతోపాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల జనాభాను కూడా తక్కువగా చూపించి అన్యాయం చేశారని, సర్వే అంతా తప్పుల తడకగా ఉందని సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.


అందుకే కేంద్రం బీసీ వర్గాల జనగణన అధికారికంగా జరపనంత వరకు బీసీ వర్గాలకు ఇలాగే తీరని అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచి, తక్షణమే బీసీ వర్గాల జన గణనను చేపట్టి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.

-గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు 73370 82570

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *