మానవత్వం లేని బీజేపీ..

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీజేపీర్ మనస్సు, మానవత్వం లేదని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తే బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఓట్ల కోసం ప్రచారమంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని ఖండించారు. దేశం, రాష్ట్రం, జిల్లాలో ఉన్న సమస్యల్లో వేటిపై బీజేపీ పోరాటాలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయటంలో కమ్యూనిస్టులను మించిన పార్టీలు ఏవైనా ఉన్నాయా అన్నారు. ఇజ్రాయిల్ మారణహోమంలో భాగంగా గాజా ప్రజలపై బాంబులు వేయటమే కాకుండా ఆకలితో మాడుస్తున్నారని, సహాయక చర్యలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మహాత్మాగాంధీ సైతం పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటిరీ మోడీ ప్రభుత్వం భారత విదేశాంగ విధానానికి భిన్నంగా వ్యవహరించటం అత్యంత దారుణమన్నారు. పాలస్తీనాకు 149 దేశాలు మద్దతిస్తే మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ తో అంటకాగుతోందన్నారు. యుద్ధానికి కావాల్సిన పరికరాలు మనదేశం నుంచి సరఫరా చేస్తుండటం దుర్మార్గమన్నారు.
బీజేపీకి మతం తప్ప ఏ సమస్య పట్టదన్నారు. తానే భారత్- పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే మోడీ ఎందుకు ఖండించటం లేదన్నారు. భారత ఆర్థికవ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని వ్యాఖ్యానించినా ఖండించటం లేదన్నారు. దిగుమతులపై అమెరికా 50శాతం పన్నులు పెంచినా బీజేపీకి పట్టడం లేదని తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్న విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు.