అధికారం పోతే కానీ బీసీలు గుర్తుకు రారా…?
బీఆర్ఎస్ సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన బీసీ మహాసభ చాలా విజయవంతమైంది. చివరి క్షణంలో నగర పోలీసులు ఈ సభకు అనుమతిచ్చిన కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక కులాల వాళ్ళు.. దాదాపు ఎనబై నుండి తొంబై బీసీ సామాజిక కులాల సంఘాల నాయకులు.. కార్యకర్తలు.. పెద్దఎత్తున బీసీలు తరలిరావడం విశేషం. కవిత ఎంచుకున్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశాలు నేటి రాజకీయాలను చాలా ప్రభావితం చేసేవి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎంచుకున్న ఈ పోరాటానికి ఒకవైపు మద్ధతు లభిస్తున్న కానీ మరోవైపు నుండి విమర్శలు వెలువడుతున్నాయి. దాదాపు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో గుర్తుకు రానీ బీసీలు అధికారం పోయిన ఏడాదికి గుర్తుకు వచ్చారా..?. పదేండ్లలో బీసీలకు ఏమి చేశారు. గొర్రెలు.. చేపపిల్లలు పంచి పెంచుకోమని చేశారు. అప్పుడు ఎందుకు బీసీలను ఉద్ధరించలేదు అని బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి .. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ విప్.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడాదిగా కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాము.. ఐదోందలకే ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ.. దేశంలో ఎక్కడ లేనివిధంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశాము. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాబై వేల ఉద్యోగాలను ఇచ్చాము. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ .. నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము .. అసలు బీసీలకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్ తగ్గించిందే బీఆర్ఎస్ అని మరో అడుగు ముందుకేసి ఆరోపించారు.
ఏది ఏమైన కానీ ఎవరూ ఎన్ని అన్నా కానీ గత అరవై ఏండ్లలో ఎక్కువగా ఇటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించింది ఉన్నతవర్గాలకు చెందిన నేతలే.. రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బహుజనులు ఇంతవరకూ రాజ్యాధికారం దక్కించుకోలేదు. బహుజనులు అధికారంలోకి వస్తేనే నేను రాసిన రాజ్యాంగానికి ఆర్ధం అని అప్పట్లో అంబేడ్కర్ అన్నట్లు రాజకీయ నేతలు అంటుంటారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మను ఆడటానికే కాదు బతుకమ్మను పేర్చడానికే వెనకడుగేసిన ఆరోజుల్లోనే బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ఉమ్మడి పాలకుల మెడలను వంచడమే కాదు విశ్వవ్యాప్తి చేసిన కవిత తాజాగా ఎంచుకున్న బీసీ ఉద్యమాన్ని సైతం విజయవంతం చేసి బీసీలకు రాజకీయాల్లో తగిన గౌరవాన్ని కల్పిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. చూడాలి మరి డాటర్ ఆఫ్ ఫైటర్ అని బిరుదున్న కవిత ఈ ఉద్యమాన్ని ఏ తీరాలకు చేరుస్తారో..!