మోదీ ఏదైనా చెప్పారంటే అది చేస్తారు..!
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ రోజు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్,బీజేపీ ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను శాలువా, పసుపు కొమ్ముల దండతో ఎంపీ అరవింద్ సత్కరించారు. సంక్రాంతి రోజు పసుపు రైతుల కలను నెరవేర్చిన నరేంద్ర మోదీకి పాదాభివందనం చేస్తున్నానని ఎంపీ అరవింద్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
మూడేళ్ల పాటు పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి ఉండనున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంక్రాంతి జరుపుకుంటున్నప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరితీరుతుందని అన్నారు. కాశ్మీర్‌లో టన్నెల్ అయినా, రైతులకు ఇచ్చే సంక్షేమ, అభివృద్ధి పథకాలైనా, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహకలైనా ఏదైనా సరే.. మాట ఇచ్చారంటే అమలు చేసి తీరుతారని ప్రశంసించారు. ప్రపంచంలోని 19 దేశాలు ప్రధాని మోదీని సర్వోన్నత పౌరపురస్కారాలతో సత్కరించాయని.. ఇది మామూలు విషయం కాదని గుర్తుచేశారు.పసుపు పంటను వ్యవసాయంలో బంగారంతో పోల్చుతామని… అలాంటి పంట సాగు కోసం ఈ బోర్డు ఎంతో ఉపయోగరంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు