హీరో టూ జీరో..!..క్రిస్ కెయిన్స్..?

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. సరిగ్గా పాతికేళ్ల కింద కూడా ఇదే చాంపియన్స్ ట్రోఫీ (అప్పట్లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్‌లో ఇండియా-న్యూజీలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలిచి కప్పు ఎగరేసుకొని పోయింది. ఆ మ్యాచ్‌లో హీరో క్రిస్ కెయిన్స్.
ఇప్పుడంటే 300+ స్కోర్లను కూడా ఈజీగా ఛేస్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వన్డేల్లో 250+ స్కోర్‌ను ఛేజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే. 2000లో కెన్యాలోని నైరోబీలో నాకౌట్ ట్రోఫీ జరిగింది. ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ తలపడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 264 పరుగులు చేసింది. సౌరవ్ గంగూలీ సెంచరీ, సచిన్ హాఫ్ సెంచరీ చేశారు. ఫస్ట్ వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యం అందించారు. రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కానీ లోయర్ ఆర్డర్ పెద్దగా పరుగులు చేయకపోవడంతో 264 పరుగులకే పరిమితం అయ్యింది.
ఇక 265 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయడానికి బరిలోకి దిగిన కివీస్ జట్టుకు మొదటి నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. టాపార్డర్ తడబడటంతో 132కే ఐదు వికెట్లు కోల్పోయింది. న్యూజీలాండ్ జట్టుకు పరాజయం తప్పదని అందరూ భావించారు. కానీ క్రిస్ కెయిన్స్ క్రీజులో పాతుకొనిపోయాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. అతను మాత్రం భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి వరకు నిలబడి న్యూజీలాండ్‌కు విజయాన్ని అందించాడు. క్రిస్ కెయిన్స్ సెంచరీ (102) కారణంగానే న్యూజీలాండ్ తొలిసారి ఒక ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచింది.
ఐసీసీ టోర్నీ ఫైనల్‌లో ఛేజింగ్ చేస్తూ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాటర్ క్రిస్ కెయిన్స్. నాకౌట్ ట్రోఫీ ఫైనల్స్‌లో ఇప్పటి వరకు మూడు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. అందులో 2000లో జరిగిన ఇండియా-న్యూజీలాండ్ ఫైనల్‌లోనే గంగూలీ, క్రిస్ కెయిన్స్ సెంచరీలు చేశారు. 1998 ఐసీసీ నాకౌట్ ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాపై వెస్టిండీస్ బ్యార్ ఫిలో వ్యాలెస్ సెంచరీ కొట్టాడు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో నమోదైన మూడు సెంచరీలు ఇవే. సరే.. ఇక అసలు విషయం..
ఈ ఫైనల్‌లో క్రిస్ కెయిన్స్ హీరోగా మారాడు. ఇప్పటికీ టాప్ టెన్ ఆల్‌రౌండర్లలో క్రిస్ కెయిన్స్ ఉంటాడు. అయితే అతని కెరీర్ మాత్రం అత్యంత వివాదాస్పదంగా ముగిసింది. కపిల్ దేవ్ నేతృత్వంలో పెట్టిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడాడు. అయితే ఐసీఎల్ రద్దయి ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది. అప్పట్లో ఐసీఎల్‌లోని ప్లేయర్లను ఐపీఎల్‌లో ఆడటానికి ముందే కపిల్ ఒప్పందం చేసుకున్నాడు. దీంతో అందరూ ఐపీఎల్ వేలంలోకి వచ్చారు. అయితే చండీగఢ్ లయన్స్ కెప్టెన్‌గా ఉన్న క్రిస్ కెయిన్స్ మాత్రం వేలంలోకి రాలేదు. దీనిపై అప్పటి ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ మాట్లాడుతూ.. కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకే అతడిని ఐపీఎల్‌లోకి తీసుకోలేదని ప్రకటించాడు.
లలిత్ మోడీ చేసిన ఆరోపణలపై క్రిస్ కెయిన్స్ కోర్టులో కేసు వేశాడు. అనేక వాయిదాల తర్వాత క్రిస్ కెయిన్స్ నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. లలిత్ మోడీవి తప్పుడు ఆరోపణలు అని కోర్టు నిర్దారించింది. దీంతో కెయిన్స్ ఇక మళ్లీ క్రికెట్ ఆడతారని అందరూ భావించారు. కానీ కోర్టు కేసు తర్వాత న్యూజీలాండ్ క్రికెటర్ లూ విన్సెంట్ మరో సారి కెయిన్స్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. తనను కెయిన్స్ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగస్వామ్యం కావాలని కోరాడని చెప్పాడు. అప్పట్లో న్యూజీలాండ్ కెప్టెన్‌గా ఉన్న బ్రెండన్ మెక్‌కల్లమ్ కూడా ఐసీసీ యాంటీ కరప్షన్అండ్ సెక్యూరిటీ యూనిట్ ముందు క్రిస్ కెయిన్స్ తన దగ్గరకు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కోసం సంప్రదించాడని.. తాను మాత్రం అంగీకరించలేదని చెప్పాడు.
అయితే క్రిస్ కెయిన్స్ ఈ ఆరోపణలను అన్నింటికీ ఖండించాడు. విన్సెంట్ లూ కావాలనే తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నాడని చెప్పాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి కావాలనే ఐసీసీ ముందు తనను దోషిగా నిలబెట్టారని చెప్పాడు. 2015లో క్రిస్ కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. కథ ఇంతటితో ఆయిపోలేదు..
ఒక వైపు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ కెరీర్ ఆగిపోయింది. మరో వైపు కోర్టు వాయిదాల కారణంగా భారీగా ఫీజులు చెల్లించి ఉన్న డబ్బంతా నీళ్లలా కరిగిపోయింది. దీంతో పిల్లల చదువు, కుటుంబ పోషణ కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ బస్సులు కడిగే పనిలో చేరాడు. అలాగే ట్రక్కులు నడిపాడు. అలా సంపాదించిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషించాడు. ఈ క్రమంలో 2021లో కెయిన్స్‌కు మేజర్ హార్ట్ ఎటాక్ వచ్చింది. సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌లో చాలా రోజులు ఐసీయూలో ఉన్నాడు. అయితే సర్జరీ చేసే సమయంలో మరో సారి హార్ట్ ఎటాక్ రావడంతో.. అతని నడుము కింద అంతా పక్షవాతంతో చచ్చుబడిపోయింది. అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితం అయ్యాడు. ఇక 2022 ఫిబ్రవరిలో క్యాన్సర్ ఎటాక్ అయినట్లు రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం క్రిస్ కెయిన్స్ అనారోగ్య సమస్యలతో ఆస్ట్రేలియా కాన్‌బెర్రాలోని తన ఇంట్లో జీవితం వెల్లదీస్తున్నాడు.
ఇలా 2000 నాకౌట్ ఫైనల్స్ హీరో.. చివరకు జీరోగా మిగిలిపోయాడు.
By భాయ్‌జాన్
