త్వరలో కేసీఆర్ తో జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు భేటీ..!

GHMC corporators to meet with KCR soon..!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు ముక్తకంఠంతో ప్రశ్నించాలని మాజీమంత్రి, సనత్ నగర్ బీఅర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ లు, పార్టీకి చెందిన కార్పొరేటర్ లతో సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజలకు అండగా నిలబడి సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ, ప్రభుత్వం పై వత్తిడి తీసుకురావాలని అన్నారు.
ఈ నెల 17 వ తేదీన మరోసారి నిర్వహించే సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మాజీ మంత్రి తలసాని చెప్పారు. ఈ సమావేశంలో మాజీమంత్రి హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.