కొత్త ఏడాదిలో తొలి పరీక్ష పంచాయతీ ఎన్నికలే..!!

 కొత్త ఏడాదిలో తొలి పరీక్ష పంచాయతీ ఎన్నికలే..!!

కొత్త సంవత్సరంలో మొదటి ఎన్నికలు, రాజకీయ పార్టీలకు మొదటి పరీక్ష పంచాయతీ ఎన్నికలే కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని పనులు దాదాపు పూర్తి చేశారు.సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కూడా ఎంపిక చేశారు. ఇక వాటి ముద్రణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మరో వైపు ఆయా పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించాయి.

నూతన సంవత్సర వేడుకల నుంచే..

ఇటీవల హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఒక గ్రామపంచాయతీ నాయకుడు తానే సర్పంచి అభ్యర్థినని ప్రకటించుకున్నాడు. తనకే పెద్ద నాయకుల ఆశీస్సులు ఉన్నాయని సదరు నాయకుడు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించుకోవడం ఆ మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితి చాలా గ్రామపంచాయతీలలో ఉంది. కొన్నింట్లో నూతన సంవత్సర వేడుకలకు భారీగా ఖర్చు చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు విందులు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని పంచాయతీలలో అధికార పార్టీ నాయకులలోనే ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు.

పెద్ద నాయకులు వీరిలో ఎవరినీ నిలువరించే పరిస్థితి కూడా లేదు. ఆయా పంచాయతీలలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కోసం కష్టపడిన వారికే అవకాశాలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ చాలా పంచాయతీల్లో అలా కాకుండా.. పార్టీలు మారి వచ్చిన వారే ముందు వరుసలో నిలిచిన పరిస్థితి కూడా ఉంది.

ఎవరు గెలిచినా మనోడే

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఆయా గ్రామాల పరిస్థితిని బట్టి పోటీ అధికంగా ఉన్న చోట నిర్ణయం వారికే వదిలేసి ఎవరు గెలిచినా వారు తమ పార్టీ అని చెప్పుకొనే పరిస్థితి ఉంది. ఇతర పార్టీల నుంచి గెలిచినా అధికార పార్టీలోకి మారడం ఇటీవలి కాలంలో మామూలైంది. గతంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పురపాలక ఛైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు అనేక మంది భారాస పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వారిలో కొందరు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. పోటీ గట్టిగా ఉండి, చర్చల వల్ల ఎవ్వరూ తగ్గని గ్రామాల్లో.. వారిని పోటీ పడనిచ్చి గెలిచిన అభ్యర్ధిని పార్టీ అభ్యర్థి అని ప్రకటించాలన్న ప్రతిపాదన కూడా కొన్ని గ్రామాల నుంచి నాయకులే నియోజకవర్గస్థాయి నాయకులకు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *