పదేండ్ల అభివృద్ధి కండ్ల ముందు ..!
![పదేండ్ల అభివృద్ధి కండ్ల ముందు ..!](https://www.singidi.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA0047-850x560.jpg)
పుట్ పాత్ వ్యాపారుల విషయంలో అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, ఇబ్బందులు పెట్టవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం పద్మారావు నగర్ లోని పార్క్ వద్ద 12.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెంకటాపురం కాలనీలో 42 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులు, 3 లక్షల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని పార్క్ లో చేపట్టనున్న అభివృద్ధి పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత లు ప్రారంభించారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పుష్వంత్ రెడ్డి నివాసం వద్ద పార్టీ నాయకులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పుట్ పాత్, వీధి వ్యాపారులంతా నిరుపేదలని వారి పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించాలని అధికారులను కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు అధికారులు కొన్ని చోట్ల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చిన్న చిన్న వ్యాపారాలే వారి కుటుంబాలకు జీవనాధారం అని చెప్పారు. వ్యాపారుల పట్ల అధికారులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే వారికి మద్దతుగా పోరాటం చేసే విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. గడిచిన 10 సంవత్సరాల నుండి నియోజకవర్గ పరిధిలో ఎంత అభివృద్ధి జరిగిందో కండ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి వంటి అనేక పనులు చేపట్టినట్లు వివరించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతోనే వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)