రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ మధ్య వివాదంపై క్లారిటీ…?

mahesh kumar goud.jpg
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జాతీయ పార్టీలంటే మరి ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే వర్గపోరు, గ్రూపు తగదాలు అని నానుడి. తెలంగాణలో దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో మొదట్నుంచి ఇటు సీఎం మంత్రుల మధ్య, ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని పలుమార్లు నిరూపితమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్ధరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని మీడియాలో, గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఆ వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు విబేధాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అవన్నీ తప్పుడు వార్తలు. రేవంత్ కు తనకు మధ్య మంచి అనుబంధం ఉందని” ఆయన తెలిపారు. తమ మధ్య ఉన్న సత్సంబంధాల వల్లనే బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లపై పోరాటం చేయగలిగాం అని మహేశ్ కుమార్ చెప్పారు.
మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ ల మౌనం బీసీలకు అన్యాయం చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని మరోసారి ఆయన జోస్యం చెప్పారు.