అసెంబ్లీలో దండం పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

 అసెంబ్లీలో దండం పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

Loading

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తిన అంశాలు హుజురాబాద్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందాలని తాను దండం పెట్టి అడుగుతున్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూనిపర్తి, మాదన్నపేట్, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బద్వాన్పల్లి గ్రామాల్లో నీటి సమస్య కారణంగా వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.

ఇరిగేషన్ అధికారులతో అనేకసార్లు మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, వెంటనే డిబిఎం 21, 22, 23, 24 ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, జమ్మికుంట మండలంలోని వావిలాల, నగురం, నాగారం, ఇల్లంతకుంట మండలంలోని బూజునూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువను, పెళ్లి భోగం గ్రామాలకు 29 ఎల్ ద్వారా నీటిని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

కల్వల ప్రాజెక్టు అమలుపై ఆందోళన
కల్వల ప్రాజెక్టు ద్వారా వీణవంక మండలంలో 6,000-7,000 ఎకరాల ఆయకట్టు లబ్ధి పొందుతుందని, దీని కోసం డీపీఆర్ సిద్దంగా ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజురాబాద్ అభివృద్ధికి ₹1000 కోట్లు కేటాయించాలి
స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి ₹800 కోట్లు కేటాయించినట్టు గుర్తు చేస్తూ, హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా ₹1000 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇది ప్రతి ఎమ్మెల్యే అభిలాషేనని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఈ తరహా నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

రుణమాఫీపై సవాల్ హుజురాబాద్ నియోజకవర్గంలో 100% రుణమాఫీ అమలవుతుందనే తప్పుడు ప్రచారం జరుగుతోందని, నియోజకవర్గంలోని 107 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామానికైనా పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పదేపదే రుణమాఫీ గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం వెంటనే నీటి సమస్య పరిష్కరించి, అవసరమైన నిధులను కేటాయించాలని కౌశిక్ రెడ్డి కోరారు. ఇరిగేషన్ మంత్రి ఈ విషయాన్ని గంభీరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *