SLBC ప్రమాదంపై బిగ్ అప్ డేట్..!

ఎస్ఎల్బీసీ కూలిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు టన్నెల్ లోకి వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలోలో మానవ తప్పిదం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కాని లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఆకస్మాత్తుగా సొరంగంలో మట్టి, నీరు చేరడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మెనేజ్మెంట్ సైనిక బృందాల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. అడ్డంకులు అధిగమించి ఘటనాస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని… నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ ప్రభుత్వానికి పరీక్షా సమయమన్న మంత్రి.. బీఆర్ఎస్, బీజేపీ తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ద్వజమెత్తారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు.
సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నామని, నిన్నటి నుంచి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని వివరించారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2007లో ప్రారంభమయ్యాయని, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 10 మీటర్ల సొరంగం పనులు కూడా చేయలేకపోయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి, వాటిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమైందని, అనుకోకుండా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు.
