తెలంగాణలో హ్యుందాయ్ (Hyundai) కొత్త మెగా టెస్టింగ్ సెంటర్
ప్రపంచ ప్రఖ్యాత హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) సంస్థ తన సరికొత్త మెగా టెస్టింగ్ సెంటర్ ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
భారీ ఎత్తున ఏర్పాటు కానున్న మెగా టెస్టింగ్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం (EVలతో సహా) ఉంటుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ప్రతినిధులతో ఈ మేరకు చర్చలు జరిపింది.హ్యుందాయ్ మోటార్స్ అనుబంధ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (HMIE) ద్వారా తెలంగాణలో మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది. అలాగే హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఇంజినీరింగ్ కేంద్రాన్ని ఆధునీకరించి, విస్తరించడానికి కూడా పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణతోపాటు కొత్తగా మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు ఎంతో కీలకమని హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హ్యుందాయ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.ప్ర lపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వం విధానాలు తెలంగాణలో ఉన్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుచేశారు.
హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎంతోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.తెలంగాణలో హ్యుందాయ్ మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు ద్వారా అనుబంధ సంస్థలు కూడా రానున్నాయి. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.