సీఎం రేవంత్ రెడ్డి శాఖాలోనే నిరుద్యోగ యువతకు అన్యాయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పశుసంవర్ధక శాఖలో, పశువైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీల కోసం ఉద్యోగ పరీక్షలు నిర్వహించినా నియామకాలలో జాప్యం జరుగుతోంది.ఈ శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల (వీఏఎస్) నియామకానికి గత ఏడాది జులై 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.. ఏడాది దాటినా ఆ ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాలేదు.
ఇందులో మామునూరు కళాశాలలో 11 అసోసియేట్ ప్రొఫెసర్లు, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిద్దిపేటలో ఒక డీన్, 18 మంది ప్రొఫెసర్లు, 17 మంది అసోసియేట్, 44 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులున్నాయి. ఎంపిక ప్రక్రియ జనవరిలో పూర్తయినా, వివిధ కారణాలతో వారికీ ఇప్పటివరకు నియామక పత్రాలు ఇవ్వలేదు.విశ్వవిద్యాలయం పరిధిలోని పశువైద్య కళాశాలల్లో ప్రవేశాల అనుమతుల కోసం పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆయా కళాశాలలకు గుర్తింపు సందేహంగా మారింది.
పశుసంవర్ధకశాఖ సీఎం పరిధిలో ఉండడంతో.. ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే వీలున్నా.. కొంతమంది ఉన్నతాధికారులు తమనే బాధ్యులను చేస్తారనే భయంతో ఈ సమాచారం సీఎం కార్యాలయానికి ఇవ్వడం లేదు.దీంతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయిందని తెలుస్తోంది.