బాలీవుడ్ కు అందుకే దూరం
ప్రస్తుతం దక్షిణాదిలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ త్రిష పేరునే చెబుతున్నారు. ఇక కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ భామ ఒక్కసారిగా తారాపథంలో దూసుకువచ్చింది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో సక్సెస్‌ఫుల్ సెకండ్ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. దక్షిణాదిలో అగ్ర నాయికలందరూ ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హిందీలో కూడా ఈ అమ్మడికి అవకాశాలొస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయమై త్రిష స్పందిస్తూ “కట్టామిఠా’ (2010) చిత్రంతో హిందీలో అడుగుపెట్టాను. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ వల్లే నాకు బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదని చాలా మంది అనుకున్నారు.
అందులో నిజం లేదు. ఆ సమయంలో నా కుటుంబాన్ని ముంబయికి మార్చడానికి మనసు ఒప్పుకోలేదు. బాలీవుడ్‌కు వెళితే ఇక్కడ చాలా సినిమాలను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దక్షిణాదిలో నాకున్న క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సినిమాలు వొద్దనుకున్నాను’ అని చెప్పింది త్రిష. ప్రస్తుతం ఈ భామ కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’, చిరంజీవి ‘విశ్వంభర’, అజిత్ ‘విడాముయర్చి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.