మాజీ మంత్రి హారీష్ రావుతో కల్సి హైడ్రా బాధితులు హోలీ పండుగ

హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవానికి వచ్చి తమ గోడును వెళ్లబోశారు. ఆ సమయంలో హరీష్ రావు.. వారి సమస్యను అర్థం చేసుకొని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు.
“తాము ఆపదలో ఉన్నప్పుడు హరీష్ రావు మానవీయ దృక్పథంతో స్పందించి తమకు అండగా నిలిచారు. ఈ సాయం తాము ఎప్పటికీ మరిచిపోలేం,” అని కాలనీవాసులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు తమ సేవాతత్పరతతో తమ గుండెల్లో నిలిచిపోయారని, హోలీ పండుగ సందర్భంగా ఆయనకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే హరీష్ రావు.. సమాజంలో ఆనందం నింపుతూ ప్రజల హృదయాల్లో నిలుస్తారని, ఆయనకు ఈ పండుగ వేళ మరింత శక్తి చేకూరాలని కాలనీ వాసులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు.హరీష్ రావు గారితో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డి ఉన్నారు.
