వాజ్ పేయ్ బాటలో మోదీ నడవాలి..!

చెన్నైలోని సచివాలయ ప్రాంగణంలో బుధ వారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ నేతృత్వంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, నామ్ తమిళర్కట్చి, అమ్మామక్కల్ మున్నేట్ర కళగం తప్ప ఎన్నికల సంఘం గుర్తింపు కలిగిన 56 రాజకీయ పార్టీల ప్రతిని ధులు హాజరయ్యారు. ఫెడరల్ రాజ్యాంగ విదానానికి, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య హక్కులకు పెను ముప్పు కలిగించేలా నియోజకవర్గాల పునర్విభజన జరపాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ అభిలపక్ష సమావేశం ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనను మరో 30 ఏళ్ల వరకూ వాయిదా వేయాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరుతూ అఖిలపక్ష సమావేశం ఏకగ్రీ వంగా తీర్మానించిందని తెలిపారు. కుటుంబ నియంత్రణ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాల ప్రాతినిధ్య హక్కులను హరించేలా పునర్విభజన ఉండకూడదన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఏ రకమైన ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహించాలన్న విషయమై నిర్ణయం తీసుకునేందుకు, ఈ సమ స్యపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు దక్షిణాది రాష్ట్రాల ఎంపీ లతో ఒక ఉమ్మడి కార్యాచరణ కమి టీని ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.
అన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు వీలుగా 1971 నాటి జనాభా లెక్కల ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగు తుందని 2000లో అప్పటి ప్రధాని వాజ్ పేయి హామీ ఇచ్చినట్టుగానే, ప్రస్తుత ప్రధాని మోదీ కూడా 2028 నుంచి మరో 30 ఏళ్ల దాకా 1971 జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగు తుందని పార్లమెంటులో హామీ ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు పెను ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీలు ఈ తీర్మానానికి గట్టి మద్దతు ఇవ్వడం విశేషం.
