మీనాక్షి నటరాజన్ జీ మీరాక ప్రజా నాయకత్వానికి ఓ మంచి ఉదాహరణ

6 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో
నమస్తే మీనాక్షి నటరాజన్ జీ !
మీ ప్రచారరహిత, నిరాడంబరమైన హైదరాబాదు రాక సాధారణ ప్రజా నాయకత్వానికి ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది. సినీ శైలిలో హడావిడి, భారీ ఫ్లెక్స్ బానర్లు, దురదృష్టకరమైన వ్యయప్రయాసల నుంచి పూర్తిగా భిన్నంగా, మీరు చూపిస్తున్న వినయపూర్వక నాయకత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అయితే, మీరు ప్రవేశిస్తున్న తెలంగాణ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి దూరమవుతూ , పోలీసు రాజ్యం, తీవ్రమైన అవినీతికి నిలయంగా మారింది. శ్రీ రేవంత్ రెడ్డి అధికారం దుర్వినియోగం చేస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారు.
ప్రజాస్వామ్య పరిపాలన – విఫలమైన హామీలు & విలువల పతనం
ప్రజల ఆశలు, అభివృద్ధి, సామాజిక సంక్షేమం వంటి ముఖ్యమైన అంశాలను విస్మరించి, ఈ ప్రభుత్వం తెలంగాణను నియంతృత్వం పెంచే ప్రదేశంగా మార్చేసింది. 14 నెలల రేవంత్ రెడ్డి పాలనలో, ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ప్రభుత్వం ప్రజల సేవ కోసం కాకుండా, రాజకీయ దౌర్జన్యం, వ్యక్తిగత లాభసాటాలకు సాధనంగా మారింది.
మీ ముందున్న బాధ్యత అమితమైనది
ఈ పాలనలో కుంభకోణాలు, అహంకారం, నియంతృత్వ ధోరణులు పాగా వేసిన నేపథ్యంలో, మీరు దీనిని గాడిలో పెట్టాలి. రేవంత్ రెడ్డి తన నియంతృత్వ ధోరణులతో ప్రభుత్వ పరిపాలనను మాత్రమే కాకుండా, పార్టీని కూడా పతనంలోకి నెట్టేశారు. పార్టీని నిర్మించిన లక్షలాది కార్యకర్తల త్యాగాలను అవమానించారు.ప్రభుత్వ వ్యవస్థలు న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విస్మరించాయి, అవినీతి, కక్ష సాధింపు, పరిపాలనా అస్తవ్యస్తతతో నిండిపోయాయి. ప్రభుత్వం న్యాయవ్యవస్థ ఆదేశాలను పట్టించుకోవడం లేదు.
పోలీసులను అణచివేత సాధనంగా మలచడం
పోలీసు శాఖ, శాంతి భద్రతల పరిరక్షణకు కాకుండా, ప్రతిపక్ష నేతలు, సామాజిక ఉద్యమకారులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వ్యక్తులపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, బెదిరింపు రాజకీయాలు తెలంగాణలో సాధారణం అయిపోయాయి. ప్రజాస్వామ్య పాలన భయానక నియంతృత్వానికి మార్పడింది.
అవినీతికి కేంద్రంగా మారిన పరిపాలన
ప్రభుత్వ నిధులు కాంట్రాక్టుల పేరుతో కొందరి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. తెలంగాణ ప్రజలకు రావాల్సిన వనరులు కొందరు అధికార-వ్యాపార వర్గాలకు మాత్రమే లభిస్తున్నాయి. అవసరమైన సేవలు, సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి.
పరిపాలనా కుప్పకూలిపోవడం
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయంగా వత్తిడి పాలనకు లొంగిపోతూ, రాజకీయ కుట్రలకు పావులుగా మారారు. పరిపాలనా చిత్తశుద్ధి పూర్తిగా లేకుండా, యధేచ్చగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ, ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, ఇప్పుడు ఆర్థికంగా క్షీణిస్తున్నది.
నాయకత్వంపై అపహాస్యం
నిజమైన నాయకత్వానికి దూరదృష్టి, బాధ్యత, ప్రజల పట్ల నిబద్ధత అవసరం. కానీ రేవంత్ రెడ్డి పాలనలో, పాలన అనేది నాటకాలుగా మారిపోయింది, మరియు రాజకీయ వ్యవస్థ అసభ్యమైన ఆరోపణలతో నిండిపోయింది. రైతుల సంక్షోభం, నిరుద్యోగ సమస్యలు, ఆర్థిక క్షీణత, సంక్షేమ పథకాల నిర్వీర్యత వంటి అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికా దృక్పథం లేదు. బదులుగా, మోసపూరిత హామీలతో ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేస్తోంది.
ప్రజలను మోసం చేసిన పాలన
తెలంగాణ ప్రజలు అవినీతికి, నియంతృత్వానికి ఓటు వేయలేదు, కానీ ఇప్పుడు రాజకీయ కుట్రలకు బలైనట్లు భావిస్తున్నారు. వారి ఆశలు బూడిదపట్టిపోయాయి, వారి ఆకాంక్షలు మోసపోయాయి.
శ్రీ రేవంత్ రెడ్డి – పరిపాలనలో ఘోర వైఫల్యం
తెలంగాణ రాష్ట్రం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. కానీ రేవంత్ రెడ్డి పాలనలో, ఇది తీవ్రంగా క్షీణించిపోయింది. అధికార దుర్వినియోగం, నియంతృత్వ ధోరణులు, ప్రజా పరిపాలన పట్ల నిర్లక్ష్యం తెలంగాణను తీవ్ర సంక్షోభంలోకి నడిపించాయి.బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ యుద్ధ సమయంలో గొప్ప నాయకుడైనా, దేశాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే, రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టినా, ప్రభుత్వాన్ని నడపడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
తెలంగాణను కాపాడే మార్గం
ఈ సంక్షోభ సమయంలో, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా, తెలంగాణను ప్రజాస్వామ్య విలువలతో తిరిగి నిలబెట్టే బాధ్యత మీపై ఉంది. పార్టీలో తీవ్ర అసంతృప్తిని పరిష్కరించడానికి, నాయకత్వాన్ని నైతిక మార్గంలో నిలపడానికి, ప్రజలకు నిజమైన పాలనను అందించడానికి మీ సాహసోపేతమైన నాయకత్వం అవసరం.తెలంగాణను ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిపాలన, గాంధేయ సిద్ధాంతాలతో మళ్లీ పునరుద్ధరించగల మార్పును మీరు తీసుకురాగలరని మేము ఆశిస్తున్నాము.మీ విజయం కోసం శుభాకాంక్షలు అంటూ
డా. దాసోజు శ్రవణ్ కుమార్ లేఖ రాశారు.
