మాజీ మంత్రి హారీశ్ రావు అబద్ధాలు..!

Former minister Harish Rao’s lies..!
మాజీ మంత్రి హరీష్ రావు మాటలు పూర్తి అబద్దాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్బీసీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు వచ్చేవని.. కానీ బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి చేయకుండా వదిలిపెట్టారని మండిపడ్డారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే నల్గొండలో నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదాన్నిఅందరికీ చూడటానికి అనుమతిస్తున్నామని… ఎవరినీ తమ ప్రభుత్వం అడ్డుకోవడం లేదని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న తమకు ఎలాంటి అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రెండు, మూడు నెలల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పున ప్రారంభిస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని అన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. ఎస్ఎల్బీసీ టన్నెల్ అనుమతుల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఆప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చుపెట్టి నామమాత్రపు పనులు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
వాళ్ల హయాంలో నీటిపారుదల శాఖను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావులకు దక్కుతుందని విమర్శించారు. తాము ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ముందుకు పోతున్నామని చెప్పారు. కేసీఆర్ హయాంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బ్లాస్ట్ జరిగి.. 9 మంది చనిపోతే ఒక్కరూ కూడా ఎందుకు పరామర్శకు రాలేదని ప్రశ్నించారు. ఆరోజు రేవంత్ రెడ్డి వస్తుంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని గుర్తుచేశారు. హరీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
