కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్..!

Harish Rao’s hard work paid off..!
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దక్షిణాది రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో కౌంటరిచ్చారు. ఆ ప్రకటనలో మాజీ మంత్రి హారీష్ రావు స్పందిస్తూ ” జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మరింత వృద్ధి చెందేలా చేయూతనివ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తుంటే ‘చోటీ సోచ్’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవ మానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
కేంద్రమంత్రి చోటీ సోచ్ కు ఇది నిదర్శనమని చురకలంటించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాలని, సెస్సులు, సర్చార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గి పోతున్నది.
వెరసి 41 శాతంలో రాష్ట్రాలకు వాస్తవంగా అందుతున్నది 30 శాతం మాత్రమేనని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలకు కేంద్రం మొండి చెయ్యి చూపటం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఆర్థిక అధికారాలు తమ వద్ద పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తున్నదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇదేనా టీమ్ ఇండియా స్ఫూర్తి? అని నిలదీశారు.
