ప్రైవేటీకరణ దిశగా తెలంగాణ ఆర్టీసీ..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి నిధులు సమకూర్చింది. నిధులు సమకూర్చడమే కాకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రగతి భవన్ (నేటి ప్రజాభవన్ )కు పిలిపించుకోని మరి జీతాలు పెంచి సంస్థను లాభాల బాటలో నడిపించారు కేసీఆర్.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తుందా..?. అందుకే రాష్ట్రంలోని ఆ సంస్థకు చెందిన ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెబుతుందా.?. అంటే తాజాగా జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే అవుననే అన్పిస్తుంది.
ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేస్తున్న సంస్థలకు వరంగల్ -2 , హైదరాబాద్ -1 డిపోలను అప్పగించింది. అంతేకాకుండా అక్కడున్న ఆర్టీసీ బస్సులు, సిబ్బందిని వేరే చోటకు తరలిస్తున్నారు. త్వరలోనే మరిన్ని డిపోలను ఇలాగే ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పనున్నారు అని ప్రచారంలో ఉంది. ఈ విషయంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “ఇప్పటికే వరంగల్ డిపోను జేబీఎం అనే సంస్థకు అప్పజెప్పింది..
సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్‌లోని పలు డిపోలను కూడా ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ప్రజా రవాణా నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తుందని, ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకైనా పోరాడుతుందని మాజీ మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. ప్రయివేటీకరణ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద గొడ్డలిపెట్టు లాంటి సమస్య. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడుతాం అని తేల్చిచెప్పారు.