పెట్టుబడులను ఆకర్షించేలా న్యూ ఎనర్జీ పాలసీ..!
తెలంగాణ రాష్ట్రానికి దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రజా ప్రభుత్వం ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తుందని ఉపముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్లానింగ్ శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన 315 మంది AE లకు మంత్రి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.గత పది సంవత్సరాలు పాలన చేసిన గత ప్రభుత్వం రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను మిగులు విద్యుత్తు ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు.
అందులో భాగంగానే నూతన ఎనర్జీ పాలసీని తీసుకురావడం వల్ల దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఉండటంతో ఈ నెల 4న జరిగిన క్యాబినెట్ సమావేశంలో న్యూ ఎనర్జీ పాలసీని ఆమోదించామని వివరించారు.దేశంలో ఇతర రాష్ట్రాల అమలు చేస్తున్న ఎనర్జీ పాలసీతో పాటు మన రాష్ట్రంలో అందుబాటులో రెనేవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి కావలసిన అన్ని అంశాలను అధ్యయనం చేసి న్యూ ఎనర్జీ పాలసీని తయారు చేసినట్లు చెప్పారు. 2030 సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్రానికి కావలసిన గరిష్ట విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు వెళుతున్నదని వివరించారు.
అదేవిధంగా ట్రాన్స్ మిషన్ వ్యవస్థను కూడా అందుకు తగ్గట్టుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి కావలసిన ప్రణాళికను తయారు చేసుకుని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. రామగుండంలో జెన్కో సింగరేణి సంస్థ కాలరీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.