అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్ లో ట్విస్ట్..!
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్‌పై ఓ వివాదం నెలకొన్నది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ క్లబ్ క్రికెట్‌లో కొనసాగుతానని ప్రకటించాడు. అయితే అవమానాల వలే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని అతని తండ్రి రవిచంద్రన్ పేర్కొన్నాడు. మీడియాతో మాట్లాడుతూ ‘అశ్విన్..వీడ్కోలు పలుకుతున్న విషయం నాకు ఆఖరి నిమిషంలో తెలిసింది అతని రిటైర్మెంట్ వెనుక చాలా కారణాలు ఉండే ఉంటాయి.
అవమానాలు వల్లే అతను ఈ నిర్ణయానికి వచ్చి ఉండచ్చు. ఎవరైనా ఎన్ని రోజులు అవమానాలు ఎదుర్కొంటారు’ అని అన్నాడు. ఇది ఆ నోటా..ఈ నోటా అన్నట్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో అశ్విన్ దిద్దుబాటు చర్యలకు దిగాడు. ‘నా తండ్రికి మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియదు. అతని మాటాలను మీరు సీరియస్‌గా తీసుకోకండి.
తండ్రుల మాటాలను మీడియా పరిగణనలోకి తీసుకుంటుందని అసలు ఊహించలేదు. జరిగిన తప్పిదాన్ని మన్నించి అతన్ని ఒంటరిగా వదిలేయండి’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే గబ్బా టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి బయల్దేరిన అశ్విన్..గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్నాడు. ఇంటి దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు అశ్విన్‌కు స్వాగతం పలికారు.